3 August, 2026 | 9:23 PM

నార్లు పోసి దుక్కులు సిద్ధం చేసుకున్నాం.. నీటిని వదలండి

03-08-2026 08:29 PM

కలెక్టర్ ను కలిసిన గణపసముద్రం సరస్సు ఆయకట్టు రైతులు

గణపురం,(విజయక్రాంతి): నార్లు పోసుకొని దుక్కులు సిద్ధం చేసుకున్నామని సాగునీటిని విడుదల చేయాలని గణప సముద్రం సరస్సు ఆయకట్టు రైతులు సోమవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మను కలిసి పరిస్థితిని వివరిస్తూ వినతి పత్రం అందజేశారు. గణపసముద్రం రిజర్వాయర్ నుంచి కోటకాలువ, మత్తడి కాలువల ద్వారా వరి పొలాలకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని కోరారు. ఈ సందర్భంగా రైతులు కలెక్టర్ కు వివరిస్తూ జూలై 17న నీటి పారుదల శాఖ అధికారులు వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కాలువల ద్వారా సాగునీటి విడుదలను నిలిపివేశారని పేర్కొన్నారు.

ఆ సమయంలో చెరువులో నీటి మట్టం 15 అడుగులు ఉండగా, ప్రస్తుతం 17 అడుగులకు చేరిందని తెలిపారు. గణపురం గ్రామంలోని సుమారు 90 శాతం కుటుంబాలు గణపసముద్రం చెరువు నీటిపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాయని  ఈ ప్రాంత భూములు వరి సాగుకు మాత్రమే అనుకూలంగా ఉండటంతో, ఇతర పంటలు సాగు చేసే అవకాశం లేదని వివరించారు. నీటి పారుదల శాఖ అధికారుల సూచనల మేరకు జూన్ చివరి వారంలో వరి నారుమడులు సిద్ధం చేసి, జూలై 10 నాటికి విత్తనాలు వేసుకున్నామని తెలిపారు. కిసాన్ మేళాలో ఇచ్చిన సూచనల ప్రకారం 125–130 రోజుల వ్యవధి గల సన్న రకాల వరిని సాగు చేస్తున్నామని, ప్రస్తుతం నాట్లు వేసే కీలక దశలో సాగునీరు అత్యవసరమైందని చెప్పారు.

మిషన్ భగీరథ తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని కూడా రైతులకు ఇబ్బంది కలగకుండా నీటిని వినియోగించే విధంగా చర్యలు తీసుకుంటామని గతంలో అధికారులు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం రామప్ప సరస్సులో తగినంత నీటి నిల్వ ఉండటంతో గ్రావిటీ ద్వారా గణపసముద్రం చెరువుకు నీరు చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెరువు నుండి కోటకాలువ, మత్తడి కాలువలకు వెంటనే సాగునీరు విడుదల చేసేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని ఈ సందర్భంగా ఆయకట్టు రైతులు కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.