6 కిలోల గంజాయి పట్టివేత.. ఆరుగురి అరెస్ట్
వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీనివాసరెడ్డి
కోదాడ,(విజయక్రాంతి): కోదాడ పట్టణ పోలీసులు 6 కిలోల గంజాయి పట్టుకొని ఆరుగురిని అరెస్ట్ చేశారు. డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, పట్టణ సీఐ శివశంకర్ సోమవారం కోదాడలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు పట్టణ పోలీసులు శ్రీరంగాపురం వద్ద గల డేగ బాబు ఫంక్షన్ హాల్ పక్కన ఏరియాలోని చెట్ల వద్ద దాడులు చేయగా 6 కిలోల గంజాయిని పట్టుకున్నారు. సంఘటనా స్థలంలో మద్దె రవితేజను పట్టుకొని విచారించగా ఒడిశా రాష్ట్రం నుంచి గంజాయి కొని అమ్ముతున్నట్లు ఒప్పుకున్నట్లు వివరించారు.
అంతేకాకుండా వైరా రోడ్డులోని షేక్ సుభానికి చెందిన మెడికల్ షాపులో కోడిన్ కలిగిన టోస్సెక్స్ సిరఫ్‌ను కొనుగోలు చేసుకొని మత్తు కోసం వాడుతున్నట్లు గుర్తించారు. సంఘటనా స్థలంలో 38 టొస్సెక్స్ సిరఫ్ బాటిళ్ళు, 1 హీరో గ్లామర్ మోటార్ సైకిల్, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మద్దే రవితేజతో పాటు గంజాయితో సంబంధం కలిగి ఉన్న పంది వినోద్, షేక్ మగ్దుం పాషా, షేక్ సుభాని, షేక్ ఇర్షాద్ లను అరెస్టు చేసినట్లు తెలిపారు. నట్టే అనుదీప్ పరారీలో ఉన్నాడని తెలిపారు. వీరిని కోర్టుకు రిమాండ్ చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఎస్సై అజయ్ కుమార్, పోలీసులు పాల్గొన్నారు.






