నీ కలలు సాకారం చేస్తాం నాన్న
తండ్రి శ్రీ పాద ఆశయాలకు పుత్రుడి అక్షర నివాళి
యువతకు ఉపాధి మార్గం చూపే మన ఊరు - మన కోచింగ్ సెంటర్ తో
శ్రీపాదరావు బాటలోనే మంత్రి శ్రీధర్ బాబు ప్రస్థానం
మంథని,(విజయక్రాంతి): కన్నతండ్రి కన్న కలలను సాకారం చేయడమే ఒక తనయుడు ఇచ్చే అత్యున్నత నివాళి అని నిరూపిస్తున్నారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్, దివంగత దుద్దిళ్ల శ్రీపాదరావు సోమవారం చిత్రపటానికి పూలమాల వేసి అశ్రునయనాలతో ఘన నివాళులర్పించారు.
తండ్రి ఆశయాలకు అనుగుణంగా మంథని నియోజకవర్గ నిరుద్యోగ యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే "మన ఊరు – మన కోచింగ్ సెంటర్" ఉచిత ఎస్‌ఐ, కానిస్టేబుల్ శిక్షణ కేంద్రాన్ని మంత్రి శ్రీధర్ బాబు స్వయంగా ప్రారంభించారు.
తండ్రి ప్రజాసేవా స్ఫూర్తితోనే ఉచిత కోచింగ్
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తన తండ్రి శ్రీపాదరావు ఎల్లప్పుడూ మంథని ప్రజల, ముఖ్యంగా యువత అభ్యున్నతిని కాంక్షించేవారని గుర్తుచేసుకున్నారు. ఆ మహనీయుని ప్రజాసేవా స్ఫూర్తితోనే, పేద కుటుంబాల పిల్లలు ఉద్యోగాలు సాధించి ఉన్నత స్థానాల్లో నిలవాలనే సంకల్పంతో ఈ ఉచిత శిక్షణకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. కోచింగ్‌తో పాటు దూరప్రాంత విద్యార్థుల కోసం ఉచిత వసతి, భోజన సౌకర్యాలు కూడా కల్పించామని పేర్కొన్నారు.
యువతకు మంత్రి మార్గదర్శనం.. 3 నెలల క్రమశిక్షణ
ప్రతిరోజూ ఉదయం 4 గంటలకే లేచి చదువుపై దృష్టి పెట్టాలని, మూడు నెలల పాటు కష్టపడితే లక్ష్యం ముంగిట్లోకి వస్తుందని మంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రతిరోజూ మాక్ టెస్ట్‌లు నిర్వహిస్తామని, తక్కువ మార్కులు వచ్చినా నిరాశపడకుండా లోపాలను అధ్యాపకుల సహాయంతో సరిదిద్దుకోవాలని సూచించారు.
తండ్రి ఆశయాలను నెరవేరుస్తూ
తండ్రి వేసిన ఆశయాల పునాదిపై, కొడుకు యువత భవిష్యత్తు కోసం చేస్తున్న ఈ కృషి మంథని నియోజకవర్గంలో నూతన ప్రోత్సాహాన్ని నింపింది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నిర్వాహకులు, కాంగ్రెస్ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత పాల్గొన్నారు.






