9 July, 2026 | 3:02 AM

మహారాష్ట్ర విలవిల

09-07-2026 01:09 AM
  1. మూడురోజులైనా వదలని ముసురు
  2. ముంబై, పుణె, నాసిక్ నగరాలు జలమయం

ముంబై, జూలై ౮: మహారాష్ట్రను వరదలు ముంచెత్తుతున్నాయి. రాష్ట్రంలో మూడురోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. ముఖ్యంగా వర్ష ప్రభావం ముంబైతోపాటు నగర పరిసర ప్రాంతాలపై తీవ్రంగా ఉంది. వరదల కారణంగా ముంబైలోని వెస్ట్ రైల్వే నెట్‌వర్క్ పరిధిలోని రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. వడాలా ప్రాంతంలో ఒక భవనం పాక్షికంగా కూలి ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన లోనావాలాలో గడిచిన మూడురోజుల్లో 1,300 మి.మీ రికార్డు స్థాయి వర్షం కురిసింది.

పాల్ఘర్ స్టేషన్ పరిధిలో సాధారణం కంటే వెయ్యి శాతం అదనంగా వర్షపాతం నమోదైంది. నాసిక్ నగరం మోకాళ్ల లోతు నీటిలో మునిగింది. శాంతాక్రూజ్ ప్రాంతంలో రికార్డు స్థాయిలో 1,383 మి.మీ వర్షపాతం నమోదైంది. వచ్చే ౨౪ గంటల్లో ముంబైతోపాటు థానే, పాల్ఘర్, రాయగఢ్ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈమేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆయాచోట్ల గంటకు 60 70 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.

నాసిక్ త్రయంబకేశ్వర్ ఆలయం మూసివేత

క్లౌడ్‌బరస్ట్ కారణంగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు నాసిక్‌లోని ప్రసిద్ధ త్రయంబకేశ్వర ఆలయం మూసివేయాల్సి వచ్చింది. వర్షాలు, వరదల కారణంగా ఆలయాన్ని మూసివేయడం చరిత్రలోనే ఇది మొదటిసారి. ఆలయం గోదావరికి అత్యంత సమీపంలోనే ఉంటుంది. నిజానికి నది జన్మస్థానమైన బ్రహ్మగిరి కొండల పాదభాగంలోనే ఆలయం ఉంటుంది. ప్రస్తుతం ఆలయ పరిసరాలన్నీ మోకాళ్ల లోతు వరదలో మునిగింది. వరద ముప్పు పొంచి ఉండటంతో భక్తుల భద్రత దృష్ట్యా ఆలయ అధికారులు మూసివేత నిర్ణయం తీసుకున్నారు.