1 April, 2026 | 2:36 AM

మహిళా సాధికారతకు మహాలక్ష్మి కిరీటం

01-04-2026 12:53 AM

  290 కోట్ల ఉచిత ప్రయాణాలతో- 10 వేల కోట్లు ఆర్థిక ఆదా

రాబోయే మూడేళ్లలో మహిళా సంఘాలకు రూ.లక్ష కోట్లకు పైగా వడ్డీలేని రుణాలు

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, మార్చి 31 (విజయక్రాంతి): తెలంగాణలో మహిళా సాధికార త దిశగా ఇందిరమ్మ ప్రభుత్వం వేసిన అడుగులు అద్భుత ఫలితాలను ఇస్తున్నాయని, మహిళా సాధికారతకు ‘మహా లక్ష్మి’ కిరీటమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాబోయే మూడేళ్లలో మహిళా సంఘాలకు రూ.లక్ష కోట్లకు పైగా వడ్డీలేని రుణాలు అందించబోతున్నామన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా అమలుచేస్తున్న ‘మహాలక్ష్మి’ ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా ఇప్పటివరకు మహిళలు సుమారు 290 కోట్ల సార్లు ప్రయాణించి, తద్వారా 10 వేల కోట్ల రూపాయల ప్రయాణ ఛార్జీలను ఆదా చేసుకున్నారని తెలిపారు. ఈ చారిత్రాత్మక మైలురాయిని పురస్కరించుకుని మంగళవారం ప్రజాభవన్‌లో ఏర్పాటుచేసిన అభినందన సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పాల్గొని, మహిళలు పొదుపు చేసుకున్న రూ.10వేల కోట్ల మెగా చెక్కును ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డికి అందజేశారు.

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే ఇచ్చిన హామీ మేరకు మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించామని, మహిళలు ఆదా చేసుకున్న ఈ రూ. 10 వేల కోట్లు వారి కుటుంబ ఆర్థిక అవసరాలకు, పిల్లల చదువులకు ఉపయోగపడతాయన్నారు. నెల నెల ఎంతమంది ప్రయాణం చేస్తున్నారో ఆ వివరాలను ఆర్థికశాఖకు పంపిస్తూ ఆర్టీసీకి డబ్బులు చెల్లించామన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాల ప్రయోజనాలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

సంవత్సరానికి రూ.లక్ష కోట్లు మహిళలకు ఇప్పిస్తామని, ఇప్పటికే రూ.57 వేల కోట్లు బ్యాంకు లింకేజీ ద్వారా మహిళలకు అందించామన్నారు. వచ్చే ఐదు సంవత్సరాల్లో రూ.10 వేల కోట్లు మహిళా సంఘాలకు వడ్డీ చెల్లిస్తామన్నారు.  కేవలం బస్సు ప్రయాణమే కాకుండా, మహిళలను లక్షాధికారులు, కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.

మహిళలు సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు స్థాపించేలా తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు. మహిళల ద్వారా కొత్త ఆర్థిక వ్యవస్థ ఏర్పడుతుందని, దీనికోసం ఎలాంటి కఠిన నిర్ణయాలైన తీసుకుంటామని, హైదరాబాద్‌లో పెద్దఎత్తున మహిళలకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్‌లో చేర్పిస్తున్నామన్నారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం అయితే కుటుంబం సమాజం ఆర్థికంగా బలోపేతం అవుతుందన్నారు. 

ప్రభుత్వ పరిశీలనలో ఆర్టీసీ విలీనం: మంత్రి పొన్నం

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ యూనియన్‌ల ఏర్పాటు, ఆర్టీసీ విలీనం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. సీసీఎస్, పీఎఫ్ బకాయిలు తీరుస్తున్నామన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇటీవల హైదరాబాద్లో 340 కొత్త రూట్‌లలో బస్సులను ప్రారంభించామని తెలిపారు. ఈ మహాలక్ష్మి పథకం విజయవంతం కావడంలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ల పాత్ర మరువలేనిదని, రోజుకు 65 లక్షల మంది ప్రయాణికులలో 40 లక్షల మంది మహిళలే ఉండటం గొప్ప విషయమన్నారు.

ఆర్టీసీని కాపాడుకుంటూనే మహిళలకు ఈ సదుపాయం కల్పిస్తున్నామని, ఇప్పటికే ఆర్టీసీకి రావాల్సిన బకాయిలను ప్రభుత్వం చెల్లిస్తోందని,. కొత్త బస్సులు, కొత్త రూట్ల ఏర్పాటుతో సంస్థను మరింత బలోపేతం చేస్తామని అని హామీ ఇచ్చారు. ఆర్టీసీకి ఎలక్ట్రిక్ బస్సులు తెచ్చింది తాము కాదని పేర్కొన్నారు.

మహిళలే సమాధానం చెప్పాలి: మంత్రి సీతక్క

ఉచిత ప్రయాణాన్ని విమర్శించే వారికి మహిళలు తమ తిరుగుబాటు ద్వారా సమాధానం చెప్పాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చా రు. మహిళలను ఆర్టీసీ బస్సులకు యజమానులను చేశామని, అలాగే సోలార్ పవర్ ప్లాంట్లు, పెట్రోల్ బంకుల నిర్వహణ బాధ్యతలు వారికి అప్పగిస్తున్నామన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేవరకు విశ్రమించేది లేదని అన్నారు. ఇప్పటివరకు రూ. 57 వేల కోట్లు మహిళా సంఘాలకు రుణాలందించామన్నారు.

తమది మాయమాటలు చెప్పి మోసం చేసే ప్రభుత్వం కాదన్నారు. ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్, మాజీ మేయర్ గద్వాల విజయ లక్ష్మి, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, సెర్ఫ్ సీఈవో దివ్య, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన, ఆర్టీసీ ఈడీలు సీహెచ్ వెంకన్న, ఖుస్రో షా ఖాన్, రాజశేఖర్‌తోపాటు పలువురు సీనియర్ అధికారులు, మహిళలు పాల్గొన్నారు.