26 April, 2026 | 2:32 AM

లక్నో గెలుపు బాట పట్టేనా?

26-04-2026 01:24 AM

కోల్‌కతాతో డూ ఆర్ డై 

లక్నో, ఏప్రిల్ 25: ఐపీఎల్ 19వ సీజన్ లక్నో సూపర్ జెయింట్స్ డూ ఆర్ డై మ్యాచ్ కు రెడీ అయింది. తమ హోంగ్రౌండ్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్‌తో తలపడబోతోంది. వరుసగా నాలుగు పరాజయాలతో ఆ జట్టు తీవ్రఒత్తిడిని ఎదుర్కొంటోంది. 7 మ్యాచ్‌లు ఆడి కేవలం 2 విజయాలే సాధించిన లక్నో పాయింట్ల పట్టికలో 9వ స్థానం లో కొనసాగుతోంది.

లక్నో ఓటములకు కారణం ఆ జట్టు పేలవమైన బ్యాటింగే. అంచనాలు పెట్టుకున్న ఏ ఒక్క బ్యాటర్ కూడా రాణించడం లేదు. గత మ్యాచ్ లో రాజస్థాన్ పై 160 పరుగుల టార్గెట్ ను కూడా ఛేదించలేకపోయింది. ఈ నేపథ్యంలో బ్యాటర్లు ఫామ్‌లోకి వస్తే తప్ప లక్నో ఓటములకు బ్రేక్ పడిలే కనిపించడం లేదు. అదే సమయంలో మితిమీరిన ప్రయోగాలు కూడా దెబ్బతీస్తున్నాయి.

బ్యాటింగ్‌లో ఓపెనర్లను తరచూ మారుస్తుండడం, మార్క్ క్రమ్ ను మిడిలార్డర్ లో చివరిన ఆడించడం, పంత్ టాపార్డర్ లో వస్తున్నా ఘోరంగా విఫలమవుతుండడం వంటివి కారణాలుగా చెబుతున్నారు. అటు బౌలింగ్ లో మహ్మద్ షమీతో పాటు మోసిన్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేశ్ పైనా అంచనాలున్నాయి. వీరు కలిసికట్టుగా రాణించలేకపోతుండడం లక్నోకు మైనస్ గా మారింది.మరోవైపు కోల్ కతా నైట్ రైడర్స్ ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది.వరుసగా ఐదు మ్యాచ్ ల ఓడిపోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న వేళ రాజస్థాన్ రాయల్స్ పై గెలుపొందింది.

ఈ మ్యాచ్ లోనూ కీలక బ్యా టర్లు తడబడకుండా రాణిస్తే మాత్రం ప్రత్యర్థిని చిత్తు చేయొచ్చు. కెప్టెన్ రహానే , సిఫర్ట్ పేలవ ఫామ్‌లో ఉండగా, రఘువంశీ కూడా నిరాశపరుస్తున్నాడు. కామెరూన్ గ్రీన్, రోవమన్ పావెల్ అంచనాలు అందుకుంటే తిరు గుండదు. రింకూ సింగ్ ఎట్టకేలకు హాఫ్ సెం చరీతో మ్యాచ్ ను గెలిపించాడు. రింకూ ఇదే జోరు కొనసాగించాలని కేకేఆర్ మేనేజ్ మెంట్ కోరుకుంటోంది. రమణ్ దీప్ సింగ్ నుంచి కూడా కోల్ కతా భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది.

అటు బౌలింగ్ లో మహేశ్ పతిరణ రాక కోల్ కతాకు పెద్ద అడ్వాంటేజ్. వైభవ్ ఆరోరా, వరుణ్ చక్రవర్తి , సునీల్ నరైన్ కూ డా ఫామ్ అందుకున్నారు. దానిని అదే ఉత్సాహంతో కొనసాగిస్తే మాత్రం రెండో విజయాన్ని ఖాతాలో వేసుకోవచ్చు. మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న లక్నో పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుందని అంచనా. గత రికార్డులను చూస్తే ఇరు జట్లు ఏడు సార్లు తలపడితే ఐదింటిలో లక్నేనే గెలిచింది. 

తుది జట్లు అంచనా

కోల్‌కతా నైట్‌రైడర్స్ : రహానే(కెప్టెన్), రఘువంశీ, గ్రీన్. రోవమన్ పావెల్, రింకూ, రమణ్‌దీప్, అంకుల్ రాయ్, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, పతిరణ

లక్నో సూపర్ జెయింట్స్ : మార్ష్, బదోని, పంత్(కెప్టెన్), నికోలస్ పూరన్, మార్క్రమ్, ముకుల్ చౌదరీ, మహ్మద్ షమీ, మోహిసిన్ ఖాన్, ప్రిన్స్ యాదవ్. దిగ్వేశ్ సింగ్ రతి, మయాంక్ యాదవ్