అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలు.. పీజీ హాస్టల్స్
కేపీహెచ్‌బీలో హాస్టల్స్‌తో ఇబ్బందులు పడుతున్న స్థానికులు
రోడ్లపై అర్ధరాత్రి యువతీ యువకుల హంగామా
పోలీసుల నిఘా కరువు
కూకట్‌పల్లి, ఆగస్టు 25 (విజయక్రాంతి): కూకట్ పల్లి నియోజకవర్గ పరిది కెపిహెచ్ బి కాలనీ హాస్టల్ లవల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హాస్టల్ లో ఉంటున్న యువతి యువకులపై నియంత్రణ లేకపోవడంతో యువతి యువకులు అర్ధరాత్రి వరకు రోడ్లపై సంచరిస్తూ స్థానిక ప్రజలకు అసౌకర్యాన్ని కలిగిస్తున్నారు.
పోలీసుల నిఘా లోపంతో యువతి యువకులు అర్ధరాత్రి వరకు రోడ్ల పైన కాలక్షేపం చేస్తూ న్యూసెన్స్ సృష్టిస్తున్నారు. ఇదేమని అడిగిన వారికి మా జీవితం మా ఇష్టం అన్నట్లు మాటలతో ఎదురు దాడులు దిగుతుండడంతో స్థానికులు కలగజేసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు.
కొందరు యువకులను గట్టిగా మందలిస్తే యువకులు దాడులకు దిగుతున్నారని స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అర్ధరాత్రి వేళ పుట్టినరోజు వేడుకలంటూ యువకులు చేసే హడావుడి అంతా ఇంతా కాదని టపాకాయలు కాలుస్తూ స్థానికులకు నిద్ర భంగం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడిగే వారే లేరన్న ధైర్యంతో నిచ్చలవిడిగా ప్రవర్తించడం యువకుల వంతైందన్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా అధికారులకు ఈ సమస్యపై ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేదని రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా ఈ సమస్యను పోలీసు ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. హాస్టల్ అసోసియేషన్ నాయకులు ఇస్తున్న మామూళ్లకు అలవాటు పడిన పోలీసులు ఆ పక్కకె రావడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
రాత్రి పది దాటిందంటే రోడ్డుపక్కల చీకటి ప్రదేశాలలో యువతీ యువకులు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు పలుమార్లు కాలనీ పెద్దలు హెచ్చరించిన సంఘటనలు కూడా ఉన్నాయన్నారు. కాలనీ యువతి యువకుల మితిమీరిన ఆగడాలు సమీపంలోని పార్కులను సైతం కలుషితం చేయడంతో ఆ పార్కుల్లోకి స్థానికులు వెళ్లడానికి జంకుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన పార్కు నిర్వాహకులు పార్కులోకి ప్రేమికులు రావద్దంటూ బోర్డులు పెట్టిన సంఘటనలు కూడా ఉన్నాయి.
100 గజాల స్థలంలో 6 నుండి 7 భవన నిర్మాణం చేసి అధిక మొత్తంలో అద్దెలకు ఆశపడి హాస్టళ్లకు ఇస్తున్నారు. దీంతో స్థానికంగా ఉన్న కాలనీవాసులు మౌలిక వసతుల ఏర్పాటు విషయంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జనాభా అధికంగా ఉండడం మంచినీరు, మురుగునీటి వ్యవస్థ అస్తవ్యస్తమవుతున్నాయి. రోజు ఎక్కడో అక్కడ మురుగునీరు రోడ్లపై పొంగిపొర్లుతున్నాయి. హాస్టల్లో కోసమే ప్రత్యేకంగా నిర్మిస్తున్న ఈ భవనాలలో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయకపోవడంతో రోడ్ల పైననే యువకులు ద్విచక్ర వాహనాలను పార్క్ చేయడంతో ఆ కాలనీలో నివసిస్తున్న వారికి అత్యవసర వైద్యం అవసరమైతే అంబులెన్స్ రాలేని పరిస్థితి నెలకొంది.
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా హాస్టల్స్..
హాస్టల్ నిర్వాహకులు వ్యాపారమే లక్ష్యంగా యువతి యువకుల ఆకృత్యాలను చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో యువతి యువకులు హాస్టల్లలో గంజాయి సేవిస్తున్నట్లు సమాచారం. గత నాలుగు రోజుల క్రితం కెపిహెచ్బి పోలీసుల ఆకస్మిక తనిఖీలలో ఓ హాస్టల్ లో యువకులు గంజాయి సేవిస్తూ పట్టుబడ్డారు. పోలీసులు వారిని రిమాండ్ కు తరలించారు. యువతి యువకులు విచ్చలవిడిగా మద్యం సేవిస్తూ అర్ధరాత్రి రోడ్లపై వీరంగం సృష్టిస్తున్నారని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అర్ధరాత్రి గంజాయి చేస్తున్న హాస్టల్లలోని యువకులు రోడ్లపై వెళ్తున్న వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తూ దాడులు చేస్తున్నారు. 15 రోజుల క్రితం అర్ధరాత్రి ఓ వాహనదారుడు పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన ధనలక్ష్మి సెంటర్లో చోటుచేసుకుంది. హా స్టల్లపై ఎలాంటి ప్రభుత్వ పన్నులు లేకపోవడంతో అధిక ఆదాయానికి ఆశపడి అ ందరూ హాస్టల్లు పెట్టడానికి మొగ్గు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వీటిపై దృష్టి సారించాలని స్థానికులు కోరుచున్నారు.
కాలనీ ఏర్పడినప్పటి నుండి ఇక్కడే నివాసం ఉంటున్నాం. హాస్టల్లో ఉంటున్న యువతి యువకుల వల్ల కాలనీవాసులకు ప్రశాంతత కరువైంది. పుట్టినరోజు వేడుకల పేర్లతో అర్థరాత్రి 12 గంటల నుండి యువతి యువకులు రోడ్లపై విచ్చలవిడిగా ప్రవర్తించడంతోపాటు అల్లరి చేస్తున్నారు. దీంతో ఇండిపెండెంట్ హౌస్ లలో నివసిస్తున్న వాళ్ళం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం. హాస్టల్ నిర్వాహకులు సమయపాలన పాటించి నిబంధనలు ఏర్పాటు చేసినట్లయితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.
గుణవతి, స్థానికురాలు






