15 July, 2026 | 1:22 AM

రాజకీయ లబ్ధి కోసమే కరువును కాళేశ్వరంతో ముడి

15-07-2026 12:00 AM

మూడు బ్యారేజీలను నిర్మించి గ్యారేజీలుగా మార్చిన చరిత్ర హరీష్ రావుది.

బుర్ర లేనిది సీఎంకు కాదు.. కేటీఆర్ కే.

ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు 

ముకరంపుర, జూలై 14 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ & బీ గెస్ట్ హౌస్ లో మంగళవారం ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయర మణా రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కేటీఆర్ కరీంనగర్ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి పై, కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ బురద చల్లడమే పనిగా పెట్టుకున్నాడని విమర్శించారు.

ముఖ్యమంత్రికి బుర్రలేదని కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, అసలు బుర్ర లేనిది కేటీఆర్ కే అని అన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అతని వరుస వైఫల్యాలే ఇందుకు నిదర్శనమన్నారు. నాడు కాలేశ్వరం ప్రాజెక్టు వల్ల కాసుల వర్షం కురిపించుకున్న బీఆర్‌ఎస్ నేడు అదే ప్రాజెక్టును కరువుతో ముడి పెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని అన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు కాలేశ్వరం ప్రాజెక్టును బాగు చేసేందుకు మూడు మాసాల కాలం మంత్రి పదవి కావాలని కోరడం హాస్యాస్పదంగా ఉందని అతని హయాంలోనే కాలేశ్వర ప్రాజెక్టు కట్టడం మరియు కట్టిన నిర్మాణం కుంగిపోవడం జరిగిందన్నారు.

ఇది విస్మరించి మరో సారి మంత్రి పదవి కావాలని అడగడం అడుగు.. బొడుగుగా ఉన్న పెండింగ్ వసూళ్ల కోసమే అని అర్థమవుతోందని విజయరమణ రావు ఎద్దేవా చేశారు. తుమ్మడి హెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం చేస్తే ఎంతో ప్రయోజనంగా ఉండేదని, పంతాలకు, పట్టుదలకు, అక్రమార్జనకు పోయి గోదావరి నది మీద ప్రాజెక్టు నిర్మించారని, నిర్మించిన మూడేళ్లకే మూడు బ్యారేజీలు ఎందుకు గ్యారేజీలుగా మారాయో బీఆర్‌ఎస్ సమాధానం చెప్పాలని, డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, ఎల్ఎండి ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సుమారు 6 లక్షల ఎకరాలకు రెండు పంటలకు నీరు అందిస్తోందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి దూర దృష్టితో అప్పట్లో నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఎప్పటికీ లైఫ్ లైన్ గా ఉంటుందన్నారు. కన్నెపల్లి పంపు హౌస్ నుండి మోటార్లను ఆన్ చేసి నీటిని ఎత్తిపోయడం వల్ల పెను ప్రమాదం పొంచి ఉందని అధికారిక ఇంజనీరింగ్ నిపుణులు పేర్కొనడం వల్లే ప్రభుత్వం తగిన విధంగా నడుచుకుంటూ ఉందని అన్నారు.

రైతు సంక్షేమాన్ని పట్టించుకోని బీఆర్‌ఎస్ ప్రస్తుతం కాలేశ్వరం ప్రాజెక్టును అడ్డుపెట్టుకొని మొసలి కన్నీళ్లు కారుస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ఏది ఏమైనా ఎన్ డి ఎస్ ఏ తదుపరి నివేదికల ప్రకారమే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కరీంనగర్ మార్కెట్ చైర్మన్ ఆకుల నర్సయ్య, కార్పొరేటర్లు పడాల అజయ్ గౌడ్ చెల్లొజ రాజు, అజయ్ రెడ్డి, మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.