calender_icon.png 12 February, 2026 | 7:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తులబుల్, చీనాబ్‌కు లైన్‌క్లియర్

12-02-2026 01:50:01 AM

ప్రాజెక్టుల పునరుద్ధరణకు జమ్మూకశ్మీర్ సర్కార్ గ్రీన్‌సిగ్నల్

శ్రీనగర్, ఫిబ్రవరి 11: తులబుల్ నావిగేషన్ బ్యారేజీ, చీనాబ్ తాగునీటి ప్రాజెక్టులను పునరుద్ధరించాలని జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మంగళవారం శాసనసభలో కీలక ప్రకటన చేశారు. సోపోర్ సమీపంలోని జీలం నదిపై తులబుల్ బ్యారేజీ నిర్మాణంతో పాటు అఖ్నూర్ వద్ద చీనాబ్ నది నుంచి జమ్మూ నగరానికి తాగునీటిని మళ్లించే పథకాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

1960 నాటి ఒప్పందం ప్రస్తుతం అమల్లో లేకపోవడంతో ఆటంకాలు తొలగిపోయాయి.  . గతేడాది  పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. దీనివల్ల గతంలో పాకిస్థాన్ అభ్యంతరాల కారణంగా 1980వ దశకంలో ఆగిపోయిన ప్రాజెక్టులకు ఇప్పుడు లైన్ క్లియర్ అయింది. దీంతో తులబుల్ లాక్ ప్రాజెక్టుతో పాటు చీనాబ్ నదిపై పలు విద్యుత్ ప్రాజెక్టులను పునరుద్ధరించేందుకు సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని సర్కార్ అధికారులను ఆదేశించింది.

అంతర్జాతీయ ఒప్పందం వల్ల కశ్మీర్ తన  నీటి వనరులను పూర్తిస్థాయిలో వాడుకోలేకపోయింది. దీనివల్ల ఏటా వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోందని ప్రభుత్వం అంచనా వేసింది. తాజా పరిణామాలతో జలవిద్యుత్ ప్రాజెక్టుల వేగం పెంచి, రాష్ట్ర అవసరాలకు సరిపడా విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.