1 March, 2026 | 8:40 PM

జర్నలిస్టు సంక్షేమ నిధికి ప్రతినెల రూ.లక్ష అందిస్తాం

01-03-2026 04:06 PM

అభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర కీలకం

జర్నలిస్టు లకు సంక్షేమ నిధి ఏర్పాటు చేద్దాం

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): అభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర కీలకం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.  స్థానిక ప్రెస్ క్లబ్ లోని శ్రీ కె.రఘురామయ్య ఆడిటోరియం లో Telangana Working Journalists Federation (TWJF) ఆధ్వర్యంలో నగర మేయర్, డిప్యూటీ మేయర్‌లతో పాటు సీనియర్ జర్నలిస్టులను సన్మానించే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రజాస్వామ్య వ్యవస్థ బలంగా నిలవాలంటే మీడియా స్వేచ్ఛ మరియు జర్నలిస్టుల భద్రత అత్యంత అవసరమని పేర్కొన్నారు.

ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే వారే జర్నలిస్టులని, వారి సేవలు సమాజానికి అమూల్యమని అన్నారు. గ్రామీణ స్థాయిలోనూ, పట్టణ స్థాయిలోనూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే బాధ్యతను జర్నలిస్టులు సమర్థంగా నిర్వర్తిస్తున్నారని ప్రశంసించారు. జర్నలిస్టుల ఇళ్లు, ఆరోగ్య బీమా, గుర్తింపు కార్డులు, పింఛన్ వంటి సంక్షేమ అంశాలు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని, ఇవి న్యాయమైన డిమాండ్లేనని,  వాటిని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి,  సమాచార శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి, సాధ్యమైనంత త్వరగా పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 

సీనియర్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో జర్నలిస్టు సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలన్నారు. ఈ నిధి విపత్కార సమయంలో జర్నలిస్టుల కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం   ఉపయోగిద్దామని ఆయన సూచించారు. అందుకు సంబంధించి, ఈ నెల నుంచి,  ప్రతి నెలా లక్ష రూపాయలు జర్నలిస్టు సంక్షేమ నిధికి అందిస్తానని ఆయన తెలిపారు.  ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి వర్గానికీ సమన్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. గత పాలనలో జరిగిన ఆర్థిక దుర్వినియోగాల వల్ల రాష్ట్ర ఖజానా సంక్షోభంలోకి వెళ్లిందని పేర్కొన్నారు.

అయినప్పటికీ ప్రజా సంక్షేమం విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. ఐక్యంగా ముందుకు సాగాలి జర్నలిస్టులు ఐక్యంగా ఉండి తమ హక్కుల సాధన కోసం పోరాడాలని, ప్రభుత్వం వారి పక్షాన నిలుస్తుందని ఎమ్మెల్యే గారు తెలిపారు. మీడియా – ప్రభుత్వం మధ్య సత్సంబంధాలు ఉండటం వల్ల ప్రజలకు మరింత మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. అనంతరం ఎమ్మెల్యే గారి చేతులమీదుగా మేయర్ డిప్యూటీ మేయర్, సీనియర్ జర్నలిస్టులకు ఘనంగా సన్మానించి, నూతన సంవత్సర డైరీని ఆవిష్కరించారు. 

ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్ కార్పొరేషన్ మేయర్ గుమాల్ మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, TWJF అధ్యక్షులు వాకిటి అశోక్,   రాష్ట్ర నాయకులు డాక్టర్ బండి విజయ్ కుమార్, నాయకులు జి. ఆశన్న ముదిరాజ్, మెట్టుకాడి ప్రభాకర్,  బస్వరాజు, నర్సింహులు, గోపాల్, రమాకాంత్ రెడ్డి, యాదయ్య, మహబూబ్‌నగర్ కార్పొరేషన్ కార్పొరేటర్లు తిరుమల వెంకటేష్, దేవ్లీ మేగ్యా నాయక్, రమేష్ రెడ్డి, ప్రశాంత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మైత్రి యాదయ్య, వర్థ రవి, గంజి ఆంజనేయులు, గుడెం ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.