1 March, 2026 | 4:59 PM

రాష్ట్రంలో కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యం

01-03-2026 03:14 PM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యం నడుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఒకవైపు దేశంలో బీజేపీ బుల్డోజర్ రాజ్యం చేస్తున్నదని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీతో పాటు మిగిలిన నేతలంతా చెబుతుంటే, తెలంగాణలో జరుగుతున్న ఈ బుల్డోజర్ రాజ్యాన్ని, దాని అరాచకాలను మాత్రం ఆపకుండా కాంగ్రెస్ మౌనంగా ఉందన్నారు. ఓ వైపు బుల్డోజర్ రాజ్యంపై విమర్శలు చేస్తూ, ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తున్న బుల్డోజర్ అరాచకాలను కేవలం రేవంత్ పంపిస్తున్న సంచుల కట్టల కోసం చూడనట్లు వదిలేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి తెలిసిన పాలన కేవలం ఇళ్లను కూలగొట్టడం, భూములు ఆక్రమించడం, రియల్ ఎస్టేట్ దందా చేయడం, దానికోసం పేదల జీవితాలను పూర్తిగా నాశనం చేయడమేనని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి ప్రజల ఇళ్లను కూలగొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడమే తన పనిగా పెట్టుకున్నారని కేటీఆర్ అన్నారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఒక్క ప్రాజెక్టు గాని, ఒక్క ఇల్లు గాని, ఒక్క రోడ్డు గాని వేయకుండా కేవలం విధ్వంసమే తన విధానంగా పెట్టుకుని ముందుకు పోతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు హైదరాబాద్‌లో మూసీ ప్రాజెక్టులో భాగంగా పెద్ద ఎత్తున తమ ఇళ్లను, భూములను, అపార్ట్‌మెంట్లను కోల్పోతున్న రాజేంద్రనగర్ ప్రాంతంలోని హైదర్ షా కోట్, మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్ బాధితులను కలిసి వారికి సంఘీభావం తెలిపారు. మూసీ బాధితుల కోసం వారు నిర్వహించిన ‘మూసీ దండి మార్చ్’ పాదయాత్రలో మూడున్నర కిలోమీటర్ల పాటు అనేకమంది బాధితులను కలుస్తూ కేటీఆర్ ముందుకు సాగారు. ఆ తర్వాత మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్ దగ్గర జరిగిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. 

ఒక్క రెండు సంవత్సరాల పాటు మూసీ బాధితులు తమ భూములను, అపార్ట్‌మెంట్లను కాపాడుకునేందుకు ప్రయత్నం చేయాలని, ఈ పోరాటంలో భారత రాష్ట్ర సమితి వారికి అండగా ఉంటుందని, తిరిగి కేసీఆర్ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూసీ కోసం ఎవరి భూములు, ఇళ్లు పోకుండా చూస్తామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. అపార్ట్‌మెంట్ వాసులు, కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ఎన్ని రకాలుగా ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసినా, వేడుకున్నా, చివరికి పసిపాపల పట్ల కనికరం చూపాలని కోరినా, కర్కశంగా ఇళ్లను ఖాళీ చేయిస్తూ, బెదిరింపులకు దిగుతూ విధ్వంసానికి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్పడుతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి ఇప్పటికే అద్భుతమైన ప్రగతి భవన్ సిద్ధంగా ఉన్నా దాన్ని కాదని చెప్పి 200 కోట్ల రూపాయలతో తనకంటూ ఒక నివాసం నిర్మించుకుంటున్నారని, ఇప్పటికే ఆయనకు ప్యాలెస్‌లాంటి ఇల్లు ఉన్నదని, అయినా రేవంత్ రెడ్డికి, ఆయన అన్నదమ్ములకు మాత్రం వందల కోట్ల ఇళ్లు కావాలి కానీ పేదలు, మధ్యతరగతి వారికి ఒక అపార్ట్‌మెంట్ కూడా ఉండకుండా ఎందుకు ఈ విధ్వంసమని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఇళ్లను కూలగొట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు. అధికారంలోకి రాగానే హైడ్రా పేరుతో వందల మంది ఇళ్లు కూలగొట్టిన రేవంత్ రెడ్డి, అటు రామగుండం, మహబూబ్‌నగర్, ఖమ్మం వంటి ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికీ ఇబ్బంది కలిగేలా, వారి జీవితాలను చిన్నాభిన్నం చేసేలా ఇళ్లు కూలగొడుతున్నారన్నారు.

కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం తన అనుచరులకు, అన్నదమ్ములకు, కుటుంబ సభ్యులకు కాంట్రాక్టులు ఇవ్వడం కోసం మూసీ పేరుతో భారీ స్కామ్‌కు తెరలేపారని, ఇందుకోసం పేదల ఇళ్లను పణంగా పెడుతున్నారన్నారు. గతంలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేవలం 16 వేల కోట్ల రూపాయలతోనే మూసీ సుందరీకరణ కార్యక్రమానికి ఒక్క ఇల్లు కూడా పోకుండా డీపీఆర్ (DPR) సిద్ధం చేశామని కేటీఆర్ తెలిపారు. కేవలం సుందరీకరణ మాత్రమే కాకుండా రోడ్లతో పాటు ఫ్లైఓవర్లను కూడా మా ప్రణాళికలో ఉంచామని, కానీ ఎక్కడా కూడా ఒక్క ఇల్లుకు ఇబ్బంది కాకుండా చూశామన్నారు. అలాంటి అంశాన్ని పక్కన పెట్టి లక్షన్నర కోట్ల రూపాయల దోపిడీ కోసం వేల మంది ఇళ్లను ధ్వంసం చేస్తూ రేవంత్ రెడ్డి కొత్త స్కామ్‌కు తెరలేపారన్నారు.

ఈరోజు మూసీ బఫర్ జోన్‌కు సంబంధించి రకరకాల మాటలు చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఆరోజు అధికారంలో ఉన్నప్పుడు ఇదే అపార్ట్‌మెంట్లకు పర్మిషన్ ఇచ్చిందని, మరి అలాంటి అధికారులపై, ఆనాడు అనుమతులు ఇచ్చిన కాంగ్రెస్ నాయకులను చెప్పుతో కొట్టాలా అని కేటీఆర్ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ జాతీయ స్థాయిలో బీజేపీ బుల్డోజర్ రాజ్యం నడిపిస్తోందని విమర్శలు చేస్తారని, స్వయంగా తమ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో చేస్తున్న బుల్డోజర్ రాజ్యం గురించి మాత్రం మాట్లాడటం లేదన్నారు. మరోవైపు మూసీలో ఇళ్లు ఉన్నాయని అబద్ధాలు చెబుతూ ధ్వంసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, తమ సొంత మంత్రులు, ప్రజా ప్రతినిధులకు ఉన్న ఫార్మ్‌హౌస్‌లు, విల్లాలు, ఇళ్లను ఎందుకు ముట్టుకోవడం లేదన్నారు. రాష్ట్రాన్ని ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ నడుపుతున్నాడని, అందుకే ఇన్ని రకాల ఇబ్బందులు వస్తున్నాయన్నారు.

 రేవంత్ రెడ్డి లాంటి భూ బకాసురుడి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని కేటీఆర్ పిలుపునిచ్చారు. మూసీ బాధితుల కోసం భారత రాష్ట్ర సమితి అన్ని రకాలుగా అండగా ఉంటుందని కేటీఆర్ తెలిపారు. వీరికి సంబంధించిన న్యాయపోరాటంలోనూ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మూసీ ప్రాజెక్టు కోసం వేలమంది ఇళ్లను కూల్చడం ఆపేయాలని, తమ ఎమ్మెల్యేలను, నాయకులను పంపి బెదిరింపులకు దిగడం మానేయాలని కేటీఆర్ హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న బెదిరింపులకు, ఇళ్లకు బదులు డబ్బులు ఇస్తామని మోసం చేసే ప్రయత్నాలకు లొంగకుండా ఐక్యంగా ముందుకు సాగాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.