26 June, 2026 | 2:50 AM

చినుకుపడితే కరెంట్ కట్!

26-06-2026 12:00 AM
  1. విద్యుత్ అధికారుల నిర్వహణ లోపంతో ప్రజలకు అవస్థలు                                
  2. కొన్ని ప్రాంతాల్లో రాత్రంతా జాగారమే
  3. గంటల కొద్ది కరెంట్ బంద్

చేగుంట, జూన్ 25: చినుకు పడితే చాలు చేగుంట మండలంలోనీ అన్ని గ్రామాలలో చీకట్లు అలుముకుంటున్నాయి. గాలివానకు తరచూ విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. చిన్న వర్షం పడితే చాలు కరెంట్ పోవడం, సబ్ స్టేషన్ లో మెయిన్ లైన్ మరమ్మతులకు ఎక్కువ సమయం పట్టడంతో, చేగుంట మండలంలో ఉన్న అన్ని సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాల ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్నిసార్లు కొన్ని గ్రామాల ప్రజలు రాత్రిళ్లు జాగారమే చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

అధికారుల అలసత్వం

వానను సైతం లెక్కచేయక సిబ్బంది, అధికారులు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారని అధికారులు చెప్తున్నారు. కానీ కొన్ని ప్రాంతాల్లో కింది స్థాయి అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది సరిపడా లేకపోయినా.. కొన్నిచోట్ల ప్రైవేట్, ప్రభుత్వ అధికారులు ఉన్నప్పటికీ, స్తంభాలు ఎక్కేందుకు ముందుకు రావడం లేదని చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని జిల్లా, మండల అధికారులు సమీక్షించినప్పుడు సరఫరా పునరుద్దరించకుండానే కొందరు పూర్తయినట్లు చెప్పడం, స్త్రంభాలు విరిగినప్పుడు, కూలినప్పుడు, నిర్వహణకు సంబంధించి కాంట్రాక్టర్లు, అధికారులకు మధ్య నిబంధనల గొడవ, సరఫరా పునరుద్ధరణ ఆలస్యమవడానికి ఇదొక కారణమవుతోందని అధికారులు అంటున్నాడు.

కొమ్మలు తొలగించడంలో జాప్యం

ఇటీవల కురిసిన వర్షాలకు, చేగుంట లోని 33 /11 కెవి సబ్ స్టేషన్ పరిధిలో ఉన్న కర్నాల్ పల్లి, గొల్లపల్లి, చందాయి పేట్, కసాన్పల్లి, అనంతసాగర్, బోనాల, తదితర గ్రామాలలో ప్రతి శుక్రవారం  ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు కొమ్మలు కొట్టేసినట్లు, ప్రజలకు ముందుగా సమాచారం ఇచ్చి మెయింటెనెన్స్ లో  నామమాత్రంగా తీసేశారని ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. మెయింటెనెన్స్లో ఇది కామన్ అని, కానీ సైప్లై సమస్యలు ఎదురైనప్పుడు ఇలాంటివి బయటకు వస్తున్నాయి., అయితే వర్షాకాలం కావడంతో మళ్లీ చెట్లకొమ్మలు పెరిగాయని  అధికారులు అంటున్నారు.

గంటలకొద్దీ కరెంట్ కట్..

బుధవారం కురిసిన చిన్న వర్షానికి పొలంపల్లి గ్రామంలో ఐదుగంటలు కరెంట్ లేదని, ప్రతీసారి ఇదే పరిస్థితి ఉంటుందని గ్రామానికి చెందిన కోండి శ్రీనివాస్ అన్నారు. వర్షం పడుతున్న సమయంలో తాము ఎన్ని సార్లు ఫోన్ చేసినా విద్యుత్ సిబ్బంది స్పందించడం లేదని, చాలామంది వినియోగదారులు, తమ గ్రామ వాట్సాప్, సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని గ్రామాలలో రాత్రంతా జాగారం చేయాల్సిన పరిస్థితి ఉండడంతో తమ పరిస్థితి మరీ దారుణంగా ఉందని పలు గ్రామాల స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టి మండలంలో ఉన్న అన్ని గ్రామాల ప్రజలకు కరెంట్ సమస్య లేకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు..