1 April, 2026 | 3:29 AM

నవ్విపోదురు గాక!

01-04-2026 12:16 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న మొండివైఖరి పశ్చిమాసియాను పెను ప్రమాదంలోకి నెడుతున్నది. శాంతిని నెలకొల్పాల్సిన అగ్రరాజ్య అధినేత యుద్ధజ్వాలలను స్వయంగా మరింత ఎగదోయడం ప్రపంచ దేశాలకు విస్మయం కలిగిస్తోంది. ఇరాన్‌పై సాగిస్తున్న ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ విషయంలో ట్రంప్ వైఖరి ఉదయం ఒకలా, సాయంత్రం మరోలా మారుతున్నది. ట్రంప్ ‘ఇరాన్‌ను సర్వనాశనం చేస్తాం.. చమురు క్షేత్రాలు, విద్యుత్ కేంద్రాలను పేల్చివేస్తాం’ అంటారు ఒకసారి.

మరోవైపు 47 ఏళ్ల ప్రతీకారం తీర్చుకుంటాం’ అంటారు మరోసారి. ఈ  వ్యాఖ్యలను మరువకముందే, ఇంతలోనే ‘ఇరాన్‌తో చర్చలు సాగుతున్నాయి’ అంటారు మరింత షాకింగ్‌గా! ఈ వ్యాఖ్యలన్నీ ఆయన ద్వంద్వ నీతికి పరాకాష్ఠ.  ఇరాన్‌పై దాడులకు సహకరించాలని ముందుగా ఆయన యూరోపియన్ యూనియన్‌ను కోరారు. ‘నాటో’ దేశాలనూ అలాగే సాయం అడిగారు. ట్రంప్ విజ్ఞప్తిని యూరోపియన్ యూనియన్, ‘నాటో’ దేశాలు నిర్ద్వంద్వంగా నో చెప్పాయి.

హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఇరాన్‌పై ఒత్తిడి పెంచడానికి, చైనా సహకారం కావాలని పరోక్షంగా కోరారు.  ఈ క్రమంలో ఆయన చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్‌తో జరగాల్సిన శిఖరాగ్ర సమావేశాన్ని వాయిదా వేశారు. జలసంధి విషయంలో చైనా సహాయం చేస్తేనే ఆ చర్చలకు అర్థం ఉంటుందని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఆ వ్యాఖ్యలపై చైనా ఘాటుగా స్పందిస్తూ ‘అమెరికా దాడులు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని మండిప డింది.

తక్షణం అమెరికా సైనిక చర్యలను నిలిపివేయాలని డిమాండ్ చేసింది. ఇక రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అయితే.. అమెరికాది వందకు వందశాతం ౠఇర్పా అమెరికా దురాక్రమణ’ అనే కుండబద్దలు కొట్టారు. ఈ ప్రతికూల స్పందనలన్నింటిపైనా ట్రంప్ స్పందించారు. ‘యుద్ధంలో మేం ఇరాన్‌ను ఒంటరిగానే మట్టికరిపిస్తాం. మాకు ఎవరి సహాయం అవసరం లేదు’ అని ప్రగల్భాలు పలికారు. తాజాగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోని పెద్ద షాకిచ్చారు.

అమెరికా విమానాలకు తమ గగనతలంలో అనుమతి లేదంటూ తెగేసి చెప్పేశారు. అంతేకాదు.. సిసిలీలోని కీలకమైన వైమానిక స్థావరాన్ని వినియోగించుకునే అవకాశం ఇవ్వబోమని తేల్చిచెప్పారు. స్పెయిన్ రక్షణ మంత్రి మార్గరెటా రోబెల్స్ కూడా మెలోని బాటలోనే నడించారు. తమ దేశం అమెరికా నెత్తిమీదకు తెచ్చుకున్న అనవసర యుద్ధంలో భాగస్వామి కాబోదని స్పష్టం చేశారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సైతం తన సైన్యాన్ని పంపే ప్రసక్తే లేదని, ఇది తమ యుద్ధం కాదని స్పష్టం చేయడం ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ.

ఇక గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పైకి చెప్పుకోవడం లేదుగానీ, ట్రంప్‌పై ఉడికిపోతున్నాయి. తమ చము రు క్షేత్రాల ధ్వంసం, భవన సముదాయాలు నేలమట్టం కావడంపై మౌనంగా కన్నీరు కారుస్తున్నాయి. తన పంతం నెగ్గించుకోవడానికి ఏకంగా ఒక దేశాన్ని తుడిచిపెట్టేస్తామనడం ట్రంప్ అరాచక ఆలోచనలకు అద్దం పడుతున్నది. ట్రంప్ ఎన్ని ఎత్తులు వేసినా, ఇరాన్ మాత్రం ఇంచు కూడా వెనక్కి తగ్గడం లేదు.

కువైట్, ఇజ్రాయెల్, సౌదీ అరేబియాలోని కీలక కేంద్రాలపై బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. అమెరికా చేతిచమురు వదిలిస్తూనే ఉంది. ఇంత జరుగుతున్నా ట్రంప్ మాత్రం తన మొండివైఖరిని వీడటం లేదు. అంతర్జాతీయ వేదికలపై నవ్వుల పాలవుతున్నప్పటికీ, ‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు’ అన్నట్టుగా ట్రంప్ పోకడలు సాగుతున్నాయి.