1 April, 2026 | 1:58 AM

సోషల్ మీడియాలో వికృత క్రీడ

01-04-2026 12:12 AM

సిద్ధగౌని సుదర్శన్ :

సోషల్ మీడియా.. భావప్రకటనకు, ఆలోచనలకు, సమాజంతో మమేకం కావడానికి తెరుచుకున్న విస్తారమైన వేదిక. జర్నలిస్ట్, నటి, యూట్యూబర్, యాత్రికురాలు, సామాజిక కార్యకర్త, రాజకీయ నాయకురాలు, రచయిత్రి.. ఇలా ఎవరైనా తమ ఆలోచనలను ప్రపంచానికి తెలియజేయగలగడం ఈ వేదికల గొప్పతనం. అయితే అదే వేదిక ఇప్పుడు మరొక చీకటి రూపాన్ని కూడా చూపిస్తున్నది.

భిన్నాభిప్రాయాన్ని సహించలేని కొందరు వ్యక్తులు సోషల్ మీడియాను ఆయుధంగా మార్చుకొని వ్యక్తిత్వ హననం, అవమానాలు, బెదిరింపులు, అసత్య ప్రచారాలకు దిగుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఈ దాడుల ప్రధాన లక్ష్యంగా మారడం ఆందోళనకర విషయం. సోషల్ మీడియా లో ఆకతాయిల ఆగడాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఎవరో ఒకరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే చాలు.. వెంటనే ట్రోలింగ్, దూషణలు, వ్యక్తిగత దాడులు మొదలవుతున్నాయి.

ఫొటోలను మార్ఫింగ్ చేసి తప్పుడు ప్రచా రం చేయడం, వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయడం, అశ్లీల కంటెంట్‌తో బెదిరింపు ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఏఐ సాంకేతికత అందుబాటులోకి రావడంతో ‘రెవెంజ్ పోర్న్’, ‘సెక్టోర్షన్’ వంటి నేరాలు మరింత ప్రమాదకరంగా మారాయి. సీసీఆ ర్‌ఐ సంస్థ అంచనా ప్రకారం సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఎనిమిది మంది మహిళల్లో ఒకరు ఇలాంటి అశ్లీల చిత్రాల బెదిరిం పులను ఎదుర్కొంటున్నారు.

ఇటీవల నటి రష్మిక మందన్న తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం ఈ సమస్య ఎంత విస్తృతంగా ఉందో తెలియజేస్తోంది. ఎనిమిదేళ్లుగా తనపై తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని, వ్యక్తిగత గోప్యతను దెబ్బతీస్తున్నారని ఆమె పేర్కొన్నారు. తప్పుడు ప్రచారాన్ని వెంటనే తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఇది కేవలం ఒక సెలబ్రిటీకి ఎదురైన సమస్య మాత్రమే కాదు. సోషల్ మీడియా వినియోగించే ఏ వ్యక్తికైనా ఇలాంటి వేధింపులు ఎదురయ్యే పరిస్థితి ఉంది.

ఇలాంటి ఆన్‌లైన్ వేధింపుల్లో ముఖ్యంగా కనిపించే రూపం సైబర్ స్టాకింగ్. ఒక వ్యక్తి సోషల్ మీడియా కార్యకలాపాలను నిరంతరం గమనిస్తూ అతనిని లేదా ఆమెను మానసికంగా వేధించడం దీనిలో భాగం. ఎమ్నెస్టీ ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు ఆన్లైన్ వేధింపులను ఎదుర్కొంటున్నారు. చాలామంది దీనిని పెద్దగా పట్టించుకోకపోవడం లేదా కుటుంబంలో చెప్పడానికి భయపడటం వల్ల ఈ సమస్య మరింత విస్తరిస్తోంది.

కానీ పరిశోధనలు చెబుతున్న వాస్తవం ఏమిటంటే ఆన్‌లైన్ వేధింపులు చాలా సందర్భాల్లో భౌతిక దాడుల దిశగా కూడా దారి తీస్తాయి. సోషల్ మీడియా దాడుల పద్ధతులు కూడా విభిన్నంగా మారుతున్నాయి. ట్రోలింగ్ చేయాలనుకున్న మహిళల ఫోన్ నంబర్లు, చిరునామాలు వంటి వ్యక్తిగత వివరాలను బహిర్గతం చేయడం ‘డాక్సింగ్’గా పిలుస్తారు. నకిలీ ఖాతాలు సృష్టించి అశ్లీల లేదా వివాదాస్పద పోస్టులు పెట్టడం ‘ఐడెంటిటీ థెఫ్ట్’.

మహిళల ఫొటోలు పెట్టుకొని మరో మహిళలను మోసం చేయడం, శరీరాకృతిపై వ్యాఖ్యలు చేయడం (బాడీ షేమింగ్) వంటి చర్యలు రోజువారీగా కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా కంపెనీల బాధ్యత కీలకం. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు నియంత్రణకు ప్రయత్నించినా సమ స్య పూర్తిగా తగ్గడం లేదు. అందుకే వినియోగదారులే జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరం.

అవసరం లేని యాప్ పర్మిషన్లు ఇవ్వకపోవడం కూడా ముఖ్యమే. వేధింపులు మొదలైన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా చర్యలు తీసుకోవాలి. సైబర్ నేరాలపై కఠిన చట్టాలు ఉన్నాయి. 1930 సైబర్ క్రైం హెల్ప్‌లైన్, 1091 మహిళల హెల్ప్‌లైన్, 14490 నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ హెల్ప్‌లైన్ల ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.- 

 వ్యాసకర్త సెల్: 97017 03684