వ్యూహాత్మకతయే విజయాన్నిస్తుంది!
పాలకుర్తి రామమూర్తి :
దూష్యామిత్రాటవీబలైర్వా పూర్వం
యోధయిత్వా
శ్రాంతమశ్రాంతః పరమభిహన్యాత్!
(కౌటిలీయం - 10- 3)
యుద్ధం అనివార్యమయితే శత్రువును ముందుగా దూష్యబలాలతోనూ, ఆటవిక బలాలతోనూ యుద్ధం చేయించి తాను అలసిపోకుండా, అలసిపోయిన శత్రువును చంపాలి. వ్యూహాత్మకంగా తన దూష్యబలం యుద్ధంలో ఓడి పోయేటట్లు చేసి శత్రువు తాను ‘జయించాననే‘ విశ్వాసంతో.. వర్తకులను, ప్రజలను దోచుకుంటూ ప్రమత్తంగా ఉన్న సమయం లో అప్రమత్తుడై ‘సత్రాన్ని‘ ఉపయోగించి చంపివేయాలి అంటాడు ఆచార్య చాణక్య. దూష్య బలాలు అనగా దేశద్రోహులుగా ప్రచారమైన బలాలు. సత్రం అంటే దాగుకు న్న బలాలు.
యుద్ధంలో విజయం సైనికుల సంఖ్యపై లేదా వారివద్ద నున్న ఆయుధ సం పత్తిపై ఆధారపడి యుండదు. వారి పోరాటపటిమ, వ్యూహాత్మక వైఖరిలపై ఆధారపడి ఉంటుంది. అంతేకాదు.. నాయకునిపై ప్రజలకున్న విశ్వసనీయతయే నాయకునికి విజ యాన్ని సమకూరుస్తుంది. భారతంలో కౌరవుల పక్షాన 11 అక్షోహిణుల సైన్యం ఉన్నది.. అపారమైన అనుభవం కలిగిన మేటి యోధులూ ఉన్నారు. పాండవుల పక్షాన 7 అక్షోహిణుల సైన్యం మాత్రమే ఉన్నది. అయినా పాండవుల విశ్వసనీయత, కృష్ణుని వ్యూహరచనా సామర్ధ్యం వారికి విజయాన్ని ప్రసాదించింది.
శత్రువెంతటి బలవంతుడైనా అతనిలో చిన్న బలహీనత ఉంటుంది. ఆ బలహీనత ను గుర్తించి దాని ఆధారంగా అతనిని జయించాలి. దానినే ‘అఖిలీస్ హీల్‘ అంటా రు. సైంధవ వధకు కృష్ణుడు మాయతో సూర్యాస్తమయాన్ని సృజించాడు. అర్జునుని మరణాన్ని చూడాలనే సైంధవుని బలహీన త అతనికి మరణాన్ని ప్రసాదించింది. అలా గే ‘ట్రోజన్ హార్స్’ అనేది గ్రీకు పురాణాలలో ప్రసిద్ధమైన కథ. గ్రీకులు ట్రాయ్ నగరాన్ని (ఈనాటి టర్కీ) జయించడానికి దాదాపు పది సంవత్సరాలు యుద్ధం చేసినా విజ యం దక్కలేదు.
బాగా ఆలోచించిన గ్రీకులు పెద్ద చెక్క గుర్రాన్నొకటి తయారుచేయించి లోపల సైనికులను ఆయుధాలతో దాచిపెట్టి, తాము అపజయాన్ని ఒప్పుకుంటున్న ట్లుగా తెలియచేస్తూ ఆ గుర్రాన్ని ట్రాయ్ నగరవాసులకు బహుమతిగా పంపారు. వారు సంతోషంగా ఆ గుర్రాన్ని స్వీకరించి విజయోత్సాహంతో విందులు వినోదాలు చేసుకొని ప్రమత్తంగా ఉండగా, ఆ రాత్రి గుర్రంలోపల ఉన్న సైనికులు వెలికి వచ్చి, దుర్గద్వారాన్ని తెరుస్తారు.
అప్పటికే అక్కడికి చేరుకున్న గ్రీకు సైనికులు వీరితో కలసి నిర్దాక్షిణ్యంగా ట్రాయ్ సైనికులను వధిస్తారు, నగరాన్ని నాశనం చేస్తారు. ఈనాడు రాజకీయంగా శత్రువును లోపలి నుంచి దెబ్బతీయడానికి ఉపయోగించే కోవర్టులాంటి మోసపూరిత వ్యూహాన్ని కూడా ‘ట్రోజన్ హార్స్’ అని వ్యవహరించడం చూస్తుంటాము.
వర్షంలో బయటకు వెళుతూ గొడుగు తీసుకువెళ్లక పోవడం, వ్యూహం లేకుండా యుద్ధం చేయడం సమానమే. మహాభారతంలో పద్మవ్యూహంలో అభిమన్యుడు ఒం టరిగా పోరాడేవేళ అతనిని ఎదిర్చలేని కౌరవులు భయంచే వెనుకకు పారిపోయినట్లుగా నటించి వెనుక నుండి మూకుమ్మడిగా అతనిపైబడి వధించడం కనిపిస్తుంది. అలాగే మహాభారత యుద్ధానంతరం నిశ్శేషంగా కౌరవులను వధించి యుద్ధంలో జయించామనే ప్రమత్తతతో ఆదమరచి నిదురించిన పాండవబలాన్ని అశ్వత్థామ రాత్రివేళ సంహరించడం కనిపిస్తుంది.
దానితో సాధించిన పాండవుల విజయమూ నిరర్ధక విజయంగా మారింది. రాజ్యాల మధ్య అభిప్రాయభేదా లు సహజమే. కాకపోతే వాటిని చర్చలద్వారా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో పరిష్కరిం చుకోవడం ఉత్తమం. తప్పనిసరిగా యుద్ధ మే చేయవలసిన పరిస్థితులలో శత్రువు యొక్క బలాబలాలను అంచనావేసి యుద్ధానికి సిద్ధంకావాలి. అహంకారానికి, ఆధిపత్య భావనలకు లోనుకాకుండా ప్రజల అభీష్టానికి, భద్రత, రక్షణలకు ప్రాధాన్యతనిస్తూ.. దేశ సార్వభౌమత్వానికి పెద్దపీటవేస్తూ అత్యవసరమయితేనే యుద్ధానికి సమ్మతించాలి.
బలం చాలనివేళ సంధిచేసుకోవడం ఉత్తమోత్తమం. యుద్ధం ఎప్పుడూ అనర్థదాయ కమే. యుద్ధం వల్ల ఇరుపక్షాలూ ఆర్థిక వనరులు, మానవ వనరులు నష్టపోవడమే కాక కోలుకోవడానికి అనేక సంవత్సరాలు పడుతుంది. అయితే దురహంకారం కళ్ళు కప్పిన ప్పుడు, ‘నేనే‘ అనే భావన ఆధిపత్య ధోరణికి ఊతమిచ్చినప్పుడు కన్నుమిన్ను గానక చివ రి అస్త్రం కావలసిన యుద్ధాన్ని ప్రాధమికాస్త్రంగా ఆదరించి పలుదేశాలు ప్రపంచ సం క్షోభానికి కారణమౌతున్నాయి.
అవసరమైన చోట వ్యూహాత్మకంగా సహనం పాటించాలి. మహాభారతంలో శిశుపాలుడు తనకు అపకారం చేసినా కృష్ణుడు అతని 100 తప్పుల వరకు సహనాన్ని, క్షమతను పాటించాడు. ధర్మరాజు వ్యూహాత్మకమైన సహనశీలత, దార్శనికతయే భీష్మద్రోణులచే వారి మరణ రహస్యాన్ని తెలుసుకునేందుకు కారణమయింది. శల్యుడిని తనకు సహాయపడేం దుకు ఒప్పించి కర్ణుని మరణానికీ కారణమయింది.
ఏ కాలంలోనైనా అభ్యుదయాన్ని సాధిస్తున్న దేశాలపట్ల ఈర్ష్యాసూయలు పెల్లుబకడం సహజమే. తమ ఆర్థిక ప్రయోజనాలకు లేదా అహంభావానికి విఘాతం కలిగితే వెంటనే స్పందించేందుకు తగిన సన్నాహాలు చేసుకోవడమూ సహజమే. అం దుకే వ్యూహాత్మకంగా పలు దేశాలతో మైత్రినిచేయడం,ప్రలోభాలకు గురిచేసి లేదా బెదిరించి ఇతర దేశాలలో తమ సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకోవడం పలు దేశాలకు పరిపాటియే.
ఈ నేపథ్యంలో ఆర్థికంగా, సైనికంగా బలీయమైన అమెరికా తనకు తాను ప్రపంచానికి పెద్దన్నగా భావిస్తూ అన్ని దేశాల అంతర్గత వ్యవహారాలలో వేలు పెట్టడం చూస్తున్నాము. తన వ్యూహాత్మక మిత్రునిగా భావిస్తూ ఇజ్రాయిల్ చుట్టూ అమెరికా దాదాపు 19 సైనిక స్థావరాలను వివిధ దేశాలలో ఏర్పాటు చేసుకోవడమే కాక ఇజ్రాయిల్ వైపెవరు కన్నెత్తి చూసినా తానే ముందుగా స్పందిస్తుంది.
ఈనాడు ఇజ్రాయిల్, ఇరాన్ల మధ్య ఏర్పడిన అభిప్రాయ భేదాలలో అమెరికా దూర డం వల్ల పరిస్థితి సంక్షిష్టమై సంక్షోభానికి కారణమయింది. ఇరాన్, ఇజ్రాయిల్- అమెరికా యుద్ధం వల్ల చాలాదేశాలు ఆర్థిక సం క్షోభానికి గురౌతున్నాయి. చమురు, గ్యాస్ లాంటి అత్యవసర వస్తువుల రవాణా ఛిద్రమైంది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఎన్నో చిన్న పరిశ్రమలు మూతపడి నిరుద్యోగతకు నిలయాలయ్యాయి. ఆర్థికమాంద్యం పెరగడం వల్ల సాధారణ ప్రజానీకం బ్రతుకులు అస్తవ్యస్తం అవుతున్నాయి.
ఈ క్రమం లో అమెరికా ప్రకటించిన 5 రోజుల యుద్ధవిరమణ కూడా వ్యూహాత్మకమేనని విశ్లేషకు లు భావిస్తున్నారు. దానితో షేర్ మార్కెట్లు పతనం కాకుండా చూడడం, ప్రమత్తంగా ఉన్న శత్రుస్థావరాలను ధ్వంసం చేయడం దాని లక్ష్యంగా చెపుతున్నారు. ‘పునరావర్తమానస్య నిరాశస్యచ జీవితే, ఆధార్యో జాయ తే వేగః తస్మాద్ భగ్నం న పీడయేత్..‘ జీవితంలో నిరాశుడై ఓడిపోయిన తరువాత కూ డా తిరిగి యుద్ధానికి వచ్చేవాని వేగాన్ని తట్టుకోవడం కష్టం. అందుచేత ఓడిపోయిన వాడిని పీడించకూడదుఅంటాడు ఆచార్య చాణక్య.




