అధిక సంఖ్యలో పెద్దమ్మతల్లిని దర్శించుకున్న భక్తులు
కొత్తగూడెం,(విజయక్రాంతి): శ్రీ కనకదుర్గ దేవస్థానము (పెద్దమ్మగుడి) ఆదివారం సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధికసంఖ్యలో విచ్చేయడంతో, ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుండే పరిసర గ్రామాల నుండే కాక, జిల్లా నలుమూలల నుండి ఇతర జిల్లాల నుండి భక్తులు అధికసంఖ్యలో విచ్చేసి, తమను చల్లంగా చూడాలని అమ్మవారిని వేడుకుంటూ బోనాలు సమర్పించినారు. సందర్భంగా దేవాలయ ఆవరణలోని శ్రీ అన్నపూర్ణా సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో, స్వామివారికి అభిషేకములు నిర్వహించారు.
అన్నప్రాశనలు, వాహనపూజలు, తలనీలాలు, అమ్మవారికి ఒడిబియ్యం, చీరలు, కనుములు, తదితర మొక్కులను చెల్లించుకొని అమ్మవారిని, స్వామివారిని దర్శించుకొని తీర్ధప్రసాదములను స్వీకరించారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఎన్. రజనీకుమారి ఆదేశముల మేరకు,భక్తులకు అవసరమైన ప్రత్యేక దర్శనమునకు క్యూలైన్లు, ఉచిత పులిహోర ప్రసాద వితరణ, మంచినీటి వసతి తదితర ఏర్పాట్లను సిబ్బంది పర్యవేక్షించినారు.






