29 August, 2026 | 3:42 AM

భూ సమస్యలు త్వరగా పరిష్కరించాలి

29-08-2026 01:32 AM

నిర్మల్ ఆగస్టు28(విజయ క్రాంతి)పెండింగ్లో ఉన్న భూసమస్యల దరఖాస్తులను ప్రాధాన్యత ప్రాతిపదికన వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి తహసీల్దార్లతో పెండింగ్ భూసమస్యల దరఖాస్తుల పరిష్కారంపై జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాల వారీ గా పెండింగ్ దరఖాస్తుల వివరాలను సమీక్షించారు.ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, క్షేత్రస్థాయి విచారణను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. దరఖాస్తుదారుల వినతులను నిబంధనల ప్రకారం ఎప్పటికప్పుడు పరిష్కరించాలని స్పష్టం చేశారు. తగిన ఆధారాలు లేని దరఖాస్తులను తిరస్కరించే సమయంలో అందుకు గల కారణాలను స్పష్టంగా నమోదు చేయాలన్నారు. భూసమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని, రెవెన్యూ, సర్వే బృందాలు స మన్వయంతో పనిచేసి భూవివాదాల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.