24 February, 2026 | 7:35 PM

కుమ్మెర సంఘటనలో నిందితులను తక్షణమే అరెస్టు చేయాలి

24-02-2026 05:35 PM

-వేముల మహేందర్ గౌడ్

హనుమకొండ,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో బీసీ, దళిత కుటుంబంపై దేవుని గుడిలోనే కులం పేరుతో దూషిస్తూ అమానుషంగా దాడి చేసి రెండు నెలల పసికందును హత్య చేసిన వారిపై తక్షణమే హత్య కేసు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ డిమాండ్ చేశారు.

మంగళవారం ఆయన హనుమకొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో ఆదిపత్య అగ్రకుల రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు అదే గ్రామానికి చెందిన బీసీ రజక కులానికి కుటుంబానికి చెందిన ఓకే కుటుంబంపై దేవున్ని దర్శించుకోవడం కోసం వెళ్ళిన గణేష్ చంద్రకళ దంపతులను కులం పేరుతో దూషించడమే కాకుండా భౌతికంగా దాడి చేసి చంకలో ఉన్న రెండు నెలల పసి గుడ్డును చంపేయడం అత్యంత విషాదకరమని, ఇలాంటి సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి, దోషులు ఏ స్థాయిలో ఉన్న ఏలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తావు లేకుండా తక్షణమే అరెస్టు చేసి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

పేద కుటుంబానికి చెందిన రజక కులస్తుడైన గణేష్ దళిత అమ్మాయిని ఆదర్శ వివాహం చేసుకొని గుడిలోకి అడుగుపెట్టిన పాపానికి అగ్రకులాల చేతిలో దాడికి గురవడమే కాకుండా తన బిడ్డను కోల్పోవడం అత్యంత బాధాకరమని, రాష్ట్రంలో మానవత్వం ఉన్న ప్రతి మనిషి ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీస్ శాఖదేనని తెలిపారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు బాధిత కుటుంబానికి బీసీ సంక్షేమ సంఘం అండగా ఉంటుందన్నారు.