కేటీఆర్ క్షమాపణ చెప్పాల్సిందే
- విద్యార్థిని మరణంపై అనుచితంగా మాట్లాడుతారా?
- ధర్నా చౌక్‌ను ఎత్తివేసి ఇప్పుడు అక్కడే నిరసనలు తెలపడం సిగ్గుచేటు
- మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్
- ఇందిరా పార్కు వద్ద బీఆర్‌ఎస్ ఆందోళనను అడ్డుకునే యత్నం
- కాంగ్రెస్ శ్రేణులను నిలువరించిన పోలీసులు
ముషీరాబాద్, జూలై 24 (విజయక్రాంతి): విద్యార్థిని మరణంపై అనుచితంగా మాట్లాడిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్షమాపణ చెప్పాల్సిందేనని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్ హయాంలో ప్రజలు, విద్యార్థులు తమ హక్కుల కోసం ఆందోళనలు చేయకుండా ’ధర్నా చౌక్’ను ఎత్తివేశారని గుర్తుచేశారు. శుక్రవారం అదే ధర్నా చౌక్‌లో కేటీఆర్ రాజకీయ స్వార్థం కోసం నిరసనలు తెలపడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.
విద్యార్థులపై లాఠీఛార్జ్ జరిగి నాలుగు రోజులు గడుస్తున్నా పట్టించుకోని కేటీఆర్, ఇప్పుడు స్వార్థ ప్రయోజనాల కోసమే ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు దిగుతున్నారని విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద బీఆర్‌ఎస్వీ చేపట్టిన ఆందోళనకు హాజరుకాకుండా కేటీఆర్‌ను వెళ్లకుండా కాంగ్రెస్ శ్రేణులతో అడ్డుకునేందుకు యత్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని నిలువరించారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ’నీట్’ పరీక్షల్లో జరిగిన అక్రమాలపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులకు మద్దతునివ్వడానికి వెళ్ళిన రాహుల్ గాంధీపై దాడి, విద్యార్థులపై లాఠీచార్జి, అరెస్టులను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ నాయకులు కేటీఆర్ నిరసనను అడ్డుకునేందుకు సమాయత్తమయ్యారు.
హిమాయత్ నగర్ వై జంక్షన్ నుంచి ఆదర్శ్ నగర్‌లోని ఓల్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. హిమాయత్ నగర్ వై జంక్షన్‌లో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఇందిరా పార్క్ వద్ద బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన భారీ మహా నిరసన కార్యక్రమానికి కేటీఆర్ హాజరవుతున్నారని తెలుసుకున్న కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుండటంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగే అవకాశం ఉండటంతో పోలీసులు భారీగా మోహరించారు.
కాంగ్రెస్ శ్రేణులను ఇందిరా పార్కు ధర్నా చౌక్‌కు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఓ విద్యార్థిని మరణంపై కేటీఆర్ అత్యంత అనుచితంగా మాట్లాడారని, వెంటనే క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.
సమస్య తీవ్రతను పక్కనపెట్టి, సదరు అమ్మాయి లవ్ ఎఫైర్ వల్లే చనిపోయిందంటూ కేటీఆర్ ఎద్దేవా చేయడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు, విద్యార్థులకు కేటీఆర్ బహిరంగంగా క్షమాపణ చెప్పిన తర్వాతే ధర్నా చౌక్ లో అడుగుపెట్టాలని అంజన్ కుమార్ యాదవ్ హెచ్చరించారు.






