24 May, 2026 | 2:24 AM

కోల్‌కథ ముందుకెళుతుందా ?

24-05-2026 01:28 AM

ఈడెన్‌లో ఢిల్లీతో కీలక పోరు

కోల్‌కతా, మే 23 : ఐపీఎల్ 19వ సీజన్‌లో ఒకే ఒక ప్లే ఆఫ్ బెర్త్ కోసం మూడు జ ట్లు పోటీపడుతున్నాయి. పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్‌తో పాటు కోల్‌కతా నైట్ రైడర్స్ రేసులో ఉన్నాయి. ఈ క్రమంలో కో ల్‌కతా తన చివరి లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడుతుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ప్లే ఆఫ్స్ చేరాలంటే ఈ మ్యాచ్‌లో కోల్‌కతా గెలవడం తప్పనిసరి. అదే సమయంలో మిగిలిన కొన్ని సమీకరణాలు కూడా కలిసి రావాలి. ఈ సీజన్‌లో చివరి లీగ్ మ్యాచ్ కావడం కేకేఆర్‌కు కలిసొచ్చే అంశం.

పంజాబ్, రాజ స్థాన్ జట్లు తమ చివరి మ్యాచ్ లలో ఓడిపోతే అప్పుడు కోల్ కతా ఢిల్లీపై విజయం సాధిస్తే సరిపోతుంది. ఒకవేళ పంజాబ్ జట్టు గెలిస్తే.. కేకేఆర్ తన మ్యాచ్లో భారీ విజయా న్ని నమోదు చేసి నెట్ రన్‌రేట్లో పంజాబ్‌ను దాటాల్సి ఉంటుంది. అయితే ఈ సమీకరణాలన్నింటికీ చెక్ పెడుతూ ఒకవేళ రాజ స్థాన్ రాయల్స్ తన మ్యాచ్‌లో గెలిస్తే మా త్రం పంజాబ్, కోల్‌కతా కథ ముగుస్తుంది.

ఈ సీజన్ ఆరంభంలో వరుస పరాజయాలతో నైట్‌రైడర్స్ సతమతమైంది. కానీ అనూహ్యంగా సెకండాఫ్‌లో పుంజుకుంది. గత ఏడు మ్యాచ్‌లలో ఆరు విజయాలు సాధించి ప్లే ఆఫ్ రేసులో నిలిచింది. ప్రస్తు తం పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉన్న కోల్ కతా సొంతగడ్డపై ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. అయితే కీలక ఆటగాడు రఘువంశీ గాయంతో దూపమవడం పెద్ద ఎదురుదెబ్బగా చెప్పాలి.

అతని స్థానంలో తేజస్వి దహియా కీపింగ్ బాధ్యతలు తీసుకోనున్నాడు. గత మ్యాచ్‌లో ముంబైని చిత్తుగా ఓడించడం రన్‌రేట్ పరంగానూ కేకేఆర్‌కు కలిసొచ్చింది. రహానే, గ్రీన్, పావెల్, మనీశ్ పాండే, రింకూ సింగ్ అంచనాల మేర రాణిస్తే కోల్‌కతాకు తిరుగుండదు. బౌలింగ్ లో వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ ఫాంలో ఉండగా... కార్తీక్ త్యాగి, అంకుల్ రాయ్‌పైనా అంచనాలున్నాయి. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ కథ దాదాపుగా ముగిసింది. ఒకవేళ ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరాలంటే అద్భుతాలు జరగాలి.

కోల్ కతాపై భారీ విజయం సాధిం చడంతో పాటు మిగిలిన మూడు జట్లు తమ చివరి మ్యాచ్‌లలో చిత్తుగా ఓడిపోవాలి. ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్స్ పై ఆశలు పెట్టుకోని ఢిల్లీ సీజన్‌ను ఘనంగా ముగించాలని భావిస్తోంది. నిలకడలేని బ్యాటింగ్ ఢిల్లీ పేలవ ప్రదర్శనకు కారణమైంది. కోల్ కతాపై కేఎల్ రాహుల్, రిజ్వీ, అభిషేక్ పోరెల్, స్టబ్స్ ,మిల్లర్ వంటి బ్యాటర్లు రాణిస్తేనే గెలుపుపై ఆశలు పెట్టుకోవచ్చు. బౌలింగ్‌లో మిఛెల్ స్టార్క్, ఎంగిడి సత్తా చాటుతున్నారు. ఈడెన్ గార్డెన్స్ బ్యాటింగ్‌కు అనుకూలించనుండగా ఛేజింగ్ జట్టుకు అడ్వాంటేజ్ ఉంటుంది.

తుది జట్ల అంచనా 

కోల్‌కతా : రహానే, తేజస్వి దహియా, గ్రీన్, పావెల్, మనీశ్ పాండే, రింకూ సింగ్, నరైన్, అంకుల్ రాయ్, కార్తీక్ త్యాగి, వరుణ్ చక్రవర్తి, సౌరవ్ దూబే

ఢిల్లీ : కేఎల్ రాహుల్, పోరెల్, సాహిల్ పరాఖ్, స్టబ్స్, మిల్లర్, అక్షర్ పటేల్ ,మాధవ్ తివారీ, త్రిపురన విజయ్, లుంగి ఎంగిడి, స్టార్క్, ముకేశ్ కుమార్