28 June, 2026 | 1:32 AM

నింగికేగిన స్క్రీన్‌ప్లే కింగ్

28-06-2026 12:20 AM

తమిళ చలనచిత్ర పరిశ్రమలో మరో అధ్యాయం ముగిసింది. విలక్షణమైన ప్రతిభతో, విశిష్టమైన వ్యక్తిగా ఒక నూతన అధ్యాయాన్ని లిఖించిన కే భాగ్యరాజ్.. భారతీయ సినీ చరిత్రలో ఇప్పుడొక పుటగా మారిపోయారు. బహుముఖ ప్రజ్ఞతో సినీ జగత్తును మెప్పించిన ఆయన వినువీధి చేరారు. తన గురువు భారతీరాజా జూన్ 10న మరణించడం.. ఆ తర్వాత కొద్ది రోజుల వ్యవధిలోనే ఇప్పుడు శిష్యుడు కే భాగ్యరాజ్ కూడా కన్నుమూయడం తమిళ చిత్రసీమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. 

ప్రముఖ నటుడిగా, దిగ్గజ దర్శకుడిగా, స్క్రీన్‌ప్లే రచయితగా గుర్తింపు పొందిన కే భాగ్యరాజ్ (73) శనివారం ఉదయం చెన్నై లో గుండెపోటుతో కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోసహజ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, చెన్నైలోని తన నివాసంలోనే విశ్రాంతి తీసుకుం టున్నారు.

శనివారం ఉదయం తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించేలోపే ఆయన తుదిశ్వాస విడిచారు. భాగ్యరాజ్‌కు భార్య పూర్ణిమ (నటి), కుమార్తె శరణ్య, కుమారుడు శాంతను (నటుడు) ఉన్నారు. చెన్నైలోని బెసెంట్ నగర్ శ్మశానవాటికలో అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి సీ జోసెఫ్ విజయ్, సినీ నటులు రజనీకాంత్, కమల్‌హాసన్ తదితర ప్రముఖులు ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. 

‘స్క్రీన్‌ప్లే కింగ్’ బిరుదాంకితుడై.. 

కే భాగ్యరాజ్ పూర్తిపేరు కృష్ణస్వామి భాగ్యరాజ్. 1953లో తమిళనాడులో జన్మించిన ఆయన దర్శకులు జీ రామకృష్ణన్, భారతీరాజాలకు అసిస్టెంట్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. భారతీరాజా చిత్రాలకు స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేశారు. 1979లో ‘సువరిల్లద చిత్తిరంగల్’ అనే తమిళ చిత్రంతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. నటి ఊర్వశి, ఆమె సోదరి కల్పన లను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. తమిళ సినిమా ‘16 వెయతినిలె (తెలుగులో పదహారేళ్ల వయసు)’లో తొలిసారి వెండితెరపై కనిపించిన ఆయన.. ఎన్నో చిత్రాలతో అలరించారు.

75 సినిమాల్లో నటించిన భాగ్య రాజ్, 25 సినిమాలకు దర్శకత్వం వహించారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, స్క్రీన్‌ప్లే రైటర్‌గా, నిర్మాతగా, సంగీత దర్శకుడిగా ఆయన భారతీయ చిత్రసీమలో ప్రత్యేక ముద్ర వేశారు. తన సుదీర్ఘ కెరీర్‌లో ఆయన 75కి పైగా సినిమాల్లో నటించారు. 25కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. అద్భుతమైన కథా గమనంతో ప్రేక్షకులను కట్టిపడేసే ఆయనను ఇండస్ట్రీలో ‘స్క్రీన్‌ప్లే కింగ్’ అని పిలిచేవారు.

ఆ కాలంలో కండలు తిరిగిన హీరోలు, భారీ యాక్షన్ సినిమాల ట్రెండ్ నడుస్తుంటే, భాగ్యరాజ్ మాత్రం బక్కపలచని రూపంతో, పక్కింటి అబ్బాయి లాంటి పాత్రలతో మెప్పించారు. సామాన్య ప్రజల కష్టాలు, మధ్యతరగతి కుటుంబాల కథలనే ఆయన నమ్ముకున్నారు. అలా సామాన్యుడినే హీరోగా చూపించటం ద్వారా తన ప్రత్యేకతను చాటాడు ఈ స్క్రీన్ ప్లే మాంత్రికుడు. హాస్యస్ఫోరకంగా, అదే సమయంలో భావోద్వేగాలను పండించేలా స్క్రీన్‌ప్లే రాయడంలో ఆయన దిట్ట. వైవాహిక బంధాలు, వివాహేతర సంబంధాలు, కుటుంబ కలహాలు వంటి సమాజంలో ఉండే సున్నితమైన సమస్యలను తనదైన రీతిలో తెరపై ఆవిష్కరించే భాగ్యం భాగ్యరాజ్‌కే దక్కింది.

గ్రాంథికం లేదా అతి నాటకీయత లేకుండా, నిత్య జీవితంలో సామాన్యులు మాట్లాడుకునే సులభమైన భాషలోనే డైలాగ్స్ రాసేవారు. ఇది ప్రేక్షకులు పాత్రలతో కనెక్ట్ అవ్వడానికి బాగా ఉపయోగపడేది. సంగీత దర్శకుడిగానూ భాగ్యరాజ్ ప్రతిభ కనబర్చారు. తన చిత్రాలకు ఆయనే స్వయంగా సంగీతాన్ని సమకూర్చుకున్నారు. ఇదు నమ్మ ఆలు, చిన్న వీడు, అమ్మ వందాచు వంటి విజయవంతమైన చిత్రాలకు ఆయనే సంగీత దర్శకుడిగా వ్యవహరించి, హిట్ పాటలను అందించారు. ఆయన కథను నడిపించే విధానంపై నేటి తరం దర్శకులు కూడా రీసెర్చ్ చేస్తుంటారు. 

మునగకాయ సింబల్.. 

ట్రెండ్స్, సింబల్స్ సృష్టించడంలో భాగ్యరాజ్‌ది అందె వేసిన చేయి. ఆయన తన సినిమాల్లో ఎక్కువగా అమాయకత్వం, కాస్త హాస్యం కలగలిసిన ‘మురుగన్’ అనే పాత్ర పేరును ఉపయోగించేవారు. భాగ్యరాజ్ దర్శకత్వం వహించిన ‘ముంధానై ముడిచ్చు’ (డ్రమ్ స్టిక్ సీన్) చిత్రంలో ‘మునగకాయ’ను ఒక రోమాంటిక్ సింబల్‌గా చూపించారు. ఆ తర్వాత సౌత్ ఇండియా సినిమాల్లో మునగకాయపై హాస్య సన్నివేశాలు రాయడానికి ఈ సన్నివేశమే స్ఫూర్తిగా నిలిచింది. 

వారసుడిగా ప్రకటించిన ఎంజీఆర్.. 

మాజీ ముఖ్యమంత్రి, దిగ్గజ నటు డు ఎంజీ రామచంద్రన్ ఒకప్పుడు భాగ్యరాజ్‌ను తన సినీ వారసుడిగా ప్రకటించారు. ముంధానై ముడిచ్చు (తెలుగులో ‘మూడు ముళ్లు’), అంధ 7 నాట్కల్ (తెలుగులో ‘రాధా కళ్యాణం’), చిన్న వీడు, డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను భాగ్యరాజ్ అందించినవే. అమితాబ్ బచ్చన్ ద్విపాత్రాభినయంలో వచ్చిన సూపర్ హిట్ హిందీ చిత్రం ఆఖ్రీ రాస్తా (1986) చిత్రానికి ఆయనే దర్శకత్వం వహించారు. ఇటీవల ధనుష్ నటించిన కుబేర (2025) చిత్రంలో ఆయన కీలక పాత్రలో కనిపించారు. 2010లో వచ్చిన ‘సిద్ధు +2’ ఆయన దర్శకత్వం వహించిన చివరి చిత్రం. 

డైరెక్టర్ల నర్సరీ.. 

తమిళ ఇండస్ట్రీలోని లివింగ్‌స్టన్, పాండ్యరాజన్, పార్తీబన్ వంటి ఎందరో ప్రముఖ దర్శకులు భాగ్యరాజ్ వద్ద సహాయ దర్శకులుగా పనిచేసి, ఆ తర్వాత పరిశ్రమలో స్టార్ డైరెక్టర్లుగా ఎదిగారు. అందుకే ఆయనను ఒక ‘దర్శకుల నర్సరీ’గా అభివర్ణిస్తారు. 

ఎంజీఆర్ పేరుతో రాజకీయ పార్టీ పెట్టి.. 

సినీ రంగంలోనే కాకుండా రాజకీయాల్లోనూ భాగ్యరాజ్ అడుగుపెట్టారు. ఎంజీఆర్ మరణం తర్వాత, 1989లో సొంతంగా ‘ఎమ్‌జీఆర్ మక్కల్ మున్నేట్ర కళగం’ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు. అయితే, ఆ తర్వాత కాలంలో ఆయన తన పార్టీని డీఎంకేలో విలీనం చేశారు. 

రెండు పెళ్లిళ్లు.. వివాదాలు 

భాగ్యరాజ్ వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులెన్నో. వివాదాలు, చేదు జ్ఞాపకాలతో ఆయన జీవితం సాగింది. భాగ్యరాజ్ మొదట తన సినిమాల్లో నటించిన ప్రముఖ నటి ప్రవీణను ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే, పెళ్లయిన కొద్ది కాలానికే 1983 ఆగస్టులో ఆమె కామెర్ల వ్యాధి కారణంగా కన్నుమూశారు. ఈ సంఘటన ఆయనను తీవ్ర మానసిక క్షోభకు గురిచేసింది. ఆ తర్వాత, 1984లో తన ‘డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్’ చిత్రం (తెలుగులో ‘మంత్రిగారి వియ్యంకుడు’ ఫేమ్)లో హీరోయిన్ గా నటించిన పూర్ణిమ జయరాంను ఆయన రెండో వివాహం చేసుకున్నారు.

వీరికి కుమార్తె శరణ్య (నటి), కుమారుడు శాంత ను (నటుడు) జన్మించారు. భాగ్యరాజ్ ‘సౌత్ ఇండియన్ ఫిల్మ్ రైటర్స్ అసోసియేషన్’ (-దక్షిణ భారత చలనచిత్ర రచయితల సంఘం) అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం పనిచేశారు. ఈ పదవిలో ఉన్నప్పుడు కథల దొంగతనం వివాదాలపై ఆయన ఎంతో నిష్పక్షపాతంగా వ్యవహరించారు. ముఖ్యంగా విజయ్ నటించిన సర్కార్ (2018) సినిమా కథా వివా దంలో, ఆ కథ వేరే రచయితదంటూ భాగ్యరాజ్ ధైర్యంగా ప్రకటించి సంచలనం సృష్టిం చారు. 

అవార్డులు.. గుర్తింపులు

భాగ్యరాజ్ తమిళ చిత్రసీమకు చేసిన విశిష్ట సేవలకుగాను ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక ‘కలైమామణి’ అవార్డు అందుకున్నారు. పలు ఉత్తమ దర్శకుడు, రచయిత అవార్డులను కూడా ఆయన ప్రభు త్వం నుంచి సొంతం చేసుకున్నారు. మూడు సార్లు ఉత్తమ దర్శకుడిగా, స్క్రీన్‌ప్లే రచయితగా ఫిలింఫేర్ అవార్డులను (సౌత్) అందు కున్నారు. 

సినీప్రముఖుల సంతాపం.. 

భాగ్యరాజ్ మృతి పట్ల సినీప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టును షేర్ చేశారు. ‘మొన్న గోవాలో ఖుష్బూ కుమార్తె పెళ్లి వేడుకలో మేమంతా కలిసి నవ్వుకుంటూ, సరదాగా మాట్లాడుకుంటూ, ఫొటోలు దిగుతూ ఎంతో ఆనందంగా గడి పాం. భాగ్యరాజ్ ఎంతో ఉత్సాహంగా కనిపించారు. అలాంటి ఆయన ఈ ఉదయం ఇక లేరనే వార్త వినడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను.

అద్భుతమైన దర్శకుడు, అసా ధారణమైన స్క్రీన్ప్లే రచయిత, గొప్ప నటుడిగా భారతీయ సినీ పరిశ్రమకు భాగ్యరాజ్ గారు అందించిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. పూర్ణిమకి, శాంతనుకు, వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి. ఈ తీరని విషాదాన్ని తట్టుకునే ధైర్యా న్ని ఆ భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను” అని ఆయన రాసుకొచ్చారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, నటులు సుమన్, సిమ్రాన్, విశాల్ కూడా సంతాపం ప్రకటించారు. 

తెలుగు చిత్రసీమతో బలమైన అనుబంధం 

తెలుగు చిత్రసీమతో భాగ్యరాజ్‌కు బలమైన అనుబంధం ఉంది. ఆయన సృష్టించిన కథలు తెలుగులో రీమేక్ అయి ఇక్కడి స్టార్ హీరోలకు భారీ విజయాలను అందించాయి. ఆయన దర్శకత్వం వహించి, నటించిన ’ముంధానై ముడిచ్చు’ చిత్రాన్ని తెలుగులో చంద్రమోహన్, రాధిక జంటగా రీమేక్ చేశారు. అదే ‘మూడు ముళ్లు’ (1983) సినిమా. ఇది ఇక్కడ కూడా సంచలన విజయం సాధించింది. భాగ్యరాజ్ క్లాసిక్ హిట్ ‘అంధ 7 నాట్కల్’ చిత్రాన్ని తెలుగులో చంద్రమోహన్, జయసుధ, శరత్‌బాబు ప్రధాన పాత్రల్లో ‘రాధా కళ్యాణం’ (1981) పేరుతో రీమేక్ చేశారు.

వెంకటేశ్, మీనా నటించిన మరో సూపర్ హిట్ చిత్రం ‘అబ్బాయిగారు’ (1993). భాగ్యరాజ్ కథ -దర్శకత్వంలో వచ్చిన ‘ఎంగ చిన్న రాసా’ (1987) చిత్రానికి రీమేక్ ఇది. చిరంజీవి నటించిన ‘విజేత’ (1985), పవన్ కళ్యాణ్ నటించిన ‘సుస్వాగతం’ (1998) వంటి చిత్రాల్లో కూడా భాగ్యరాజ్ స్క్రీన్‌ప్లే శైలి ప్రభావం కనిపిస్తుంది. ఆయన తమిళ చిత్రాలు తెలుగులోకి డబ్ అయి ఇక్కడి ప్రేక్షకులను కూడా అలరించాయి. 

‘భాగ్య’ పత్రికను స్థాపించి.. విలక్షణ నవలలు అందించి.. 

భాగ్యరాజ్ కేవలం సినిమాలకే పరిమితం కాకుండా, పత్రికా సంపాదకుడిగానూ సేవలందించారు. తమిళంలో ‘భాగ్య’ అనే ప్రసిద్ధ వారపత్రికను నడిపారు. ఇందులో పాఠకులు అడిగే వ్యక్తిగత, కుటుంబ సమస్యలకు ఆయన ఇచ్చే సలహాలు, సమాధానాలు ఎంతో ప్రజాదరణ పొందాయి. భాగ్యరాజ్ 1990ల ప్రారంభంలో స్థాపించిన ఈ పత్రిక ఇప్పటికీ శరణ్య పబ్లికేషన్స్ ద్వారా వెలువడుతోంది. ‘మ్యాగ్‌స్టర్’ వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఈ పత్రిక ప్రింట్ రూపంతోపాటు డిజిటల్ ఫార్మాట్లలోనూ పాఠకులకు అందుబాటులో ఉంది.

చలనచిత్ర పరిశ్రమలో ఒక నూతన అధ్యాయాన్ని లిఖించిన భాగ్యరాజ్.. సినిమాల్లోనే కాకుండా సామాజిక విషయాలపై తనకున్న పట్టుతో ఆయన పలు పుస్తకాలు, నవలలను రచించారు. అవి ముఖ్యంగా ‘భాగ్య’ పత్రిక ద్వారా ప్రజాదరణ పొందాయి. ఈ పత్రికలో నిర్వహించిన ప్రసిద్ధ ప్రశ్నోత్తరాల శీర్షిక ఆధారంగా ‘భాగ్యరాజిన్ కేల్వి బదిల్’ పేరుతో ఐదు భాగాల పుస్తకాల సిరీస్ విడుదలైంది. పాఠకుల వ్యక్తిగత, సామాజిక సమస్యలకు ఆయన ఇచ్చిన చమత్కారమైన, ఆలోచనాత్మకమైన సమాధానాల సంకలనం ఇది.

ఆయన దర్శకత్వం వహించిన ముంధానై ముడిచ్చు, అంధ 7 నాట్కల్, చిన్న వీడు వంటి క్లాసిక్ చిత్రాల స్క్రిప్టులను నవలల రూపంలో ప్రచురించారు. సాధారణ పాఠకులకు కూడా సినిమా స్క్రీన్‌ప్లే చదువుతున్న అనుభూతిని ఇవి కలిగించాయి. వివిధ వారపత్రికల్లో ఆయన రాసిన చిన్న కథలు, చలనచిత్ర పరిశ్రమలో తన గురువు కే భారతీరాజాతో గడిపిన రోజులు, ఎదుర్కొన్న సవాళ్లను వివరిస్తూ రాసిన వ్యాసాలు పుస్తక రూపంలో వచ్చాయి.