28 February, 2026 | 12:32 PM

ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాం.. అభివృద్ధి చేస్తాం..

28-02-2026 01:00 AM

నాయకన్ గూడెంలో పీవీ ఫంక్షన్ హాల్‌ను ప్రారంభించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి

కూసుమంచి, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): నిత్యం పల్లెల్లో తిరుగుతామని, ప్రజలతోనే ఉంటామని, పల్లెలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి తెలిపారు. కూసుమంచి మండలంలోని నాయకన్ గూడెం గ్రామంలో  కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు గొల్లపూడి వీరన్న నూతనంగా నిర్మించిన ‘పీవీ (పవన్)ఫంక్షన్ హాల్’ను ఎంపీ రఘురాం రెడ్డి శుక్రవారం ప్రారంభించారు.

ప్రత్యేక పూజల అనంతరం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అంతకుముందు నాయకన్ గూడెం వచ్చిన ఎంపీ రఘురాం రెడ్డికి గ్రామస్థులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ రఘురాం రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి వసతులు ఉండటం సామాజిక కార్యక్రమాలకు దోహదపడుతుందని అన్నారు. వివాహాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహించేందుకు ఈ ఫంక్షన్ హాల్ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

గ్రామ అభివృద్ధికి తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం కాంగ్రెస్ పార్టీగ్రామ అధ్యక్షుడు గొల్లపూడి వీరన్న, సూర్య కళ దంపతులు, వారి కుటుంబ సభ్యులు ఎంపీని సత్కరించారు.  ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కంచరి సైదమ్మ కొండల్, ఉపసర్పంచ్ భీష్మాచారి, మండల నాయకులు బజ్జురి వెంకటరెడ్డి, కొమురెల్లి లింగారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కంచర్ల సుధీర్ రెడ్డి, నాయకులు కంచర్ల వీరారెడ్డి, కంచర్ల పవన్ రెడ్డి, మైనారిటీ నాయకులు ఎండి. జహంగీర్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.