28 February, 2026 | 7:55 PM

కోర్టు తీర్పుతో వారు అమాయకులని చెప్పలేం

28-02-2026 12:59 AM
  1. అది డిశ్చార్జ్ పిటిషన్ మాత్రమే

తదుపరి చర్యలపై సీబీఐ నిర్ణయం తీసుకోవచ్చు

కేసులో వాస్తవాలు లేకపోతే సెల్‌ఫోన్లు ఎందుకు తగలబెట్టారు?

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

హైదరాబాద్, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): మద్యం పాలసీ కేసులో సీబీఐ, అడ్వకేట్ల మధ్య తలెత్తిన సాంకేతిక అంశాల లోపాలపై కోర్టు నిర్ణయం తీసుకుందని, అంతమాత్రాన వారు అమాయకులని చెప్పలేమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు అన్నారు. ఈ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు వెల్లడించిన తీర్పు విషయంలో కేజ్రీవాల్, కవితకు సంబంధించిన డిశ్చార్జ్ పిటిషన్ అనేది పూర్తిగా న్యాయపరమైన ప్రక్రియ మాత్రమే అని స్పష్టం చేశారు. ఇది కేవలం ట్రయల్ కోర్టులో జరిగిన ఒక నిర్ణయం మాత్రమేనని, తదుపరి చర్యలపై సీబీఐ నిర్ణయం తీసుకోవచ్చని తెలిపారు.

శుక్రవారం బీజేపీలో చేరికల సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో రాంచందర్‌రావు మాట్లాడారు. ఢిల్లీ మద్యం కేసులో వాస్తవాలు లేకపోతే సెల్‌ఫోన్లు ఎందుకు తగలబెట్టారు?, కేజ్రీవాల్ పాలసీని ఎందుకు మార్చుకున్నారు?, రివర్స్ పాలసీ ఎందుకు తీసుకొచ్చారు? అని ప్రశ్నించారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీపై 2022లో మొదట కంప్లైంట్ చేసింది కాంగ్రెస్ పార్టీనే అని గుర్తుచేశారు.

ఆ తర్వాతే 2024లో ఈడీ, సీబీఐ రంగంలోకి దిగాయన్నారు. ఈ కేసులో కేవలం సాంకేతిక లోపాల కారణంగానే డిశ్చార్జ్ పిటిషన్‌ను కోర్టు అనుమతించినట్లు తెలుస్తోందన్నారు. తెలంగాణలో మేధావులు, విద్యావంతులు బీజేపీ వైపు ఆకర్షితు లవుతున్నారని, బీజేపీ సిద్ధాంతం, దేశాభివృద్ధిపై మా దృష్టి పట్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందనడానికి ఇదే నిదర్శనమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సుపరిపా లన, పారదర్శక పాలన, పనితీరుపై దేశవ్యాప్తంగా ప్రజలకు నమ్మకం పెరిగిందన్నారు. అందుకే వివిధ రాష్ట్రాల్లో బీజేపీ అద్భుత విజయాలు సాధిస్తోందన్నారు. ఇప్పుడు తెలం గాణలో కూడా మొదలైందన్నారు. 

అక్బరుద్దీన్ వ్యాఖ్యలు నాటకంలో భాగమే..

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఇద్దరూ ముస్లింల వ్యతిరేకులు అంటూ అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు నాటకంలో భాగంగా చేసి, చిల్లర రాజకీయ వ్యాఖ్యలే తప్ప మరొకటి కాదన్నారు. గతంలో ఎన్నికల ప్రచారంలో రేవంత్‌రెడ్డి స్వయంగా కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఈజ్ కాంగ్రెస్ అని బహిరంగంగా ప్రకటించారని, కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ అని కూడా ప్రకటించడం వారి రాజకీయ దృక్పథాన్ని చూపిస్తోందని తెలిపారు.

మజ్లిస్ పార్టీ కాంగ్రెస్‌తో అంటకాగుతోందన్న విషయం ప్రజలకు అర్థమ వడంతో, ఆ భయంతోనే రేవంత్ రెడ్డి అక్బరుద్దీన్‌తో మాట్లాడి ఇలాంటి వ్యాఖ్యలు చేయించినట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తమకు నష్టం జరుగుతుందన్న భయంతో సీఎం రేవంత్‌రెడ్డి అక్బరుద్దీన్ చేత ఈ వ్యాఖ్యలు చేయించారని తెలిపారు. హైదరాబాద్ తెలంగాణ గుండెకాయ లాంటిదని, ఈ నగరాన్ని కబ్జా పెట్టేందుకే రేవంతుద్దీన్, అక్బరుద్దీన్ ఈ రాజకీయ నాటకాలని, అందుకే హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. 

పార్టీ సిద్ధాంతాలు అర్థం చేసుకునేలా శిక్షణా తరగతులు

బీజేపీ కార్యకర్తలు నాయకత్వ లక్షణాలను, పార్టీ సిద్ధాంతాలను అర్థం చేసుకునేలా పండిట్ దీన్‌దయాళ్ శిక్షణా అభిమాన్ తరగతులు జరుగుతున్నాయని రామచందర్ రావు తెలిపారు. కొత్త కార్యకర్తలకు, వివిధ వృత్తుల నుంచి మన పార్టీలో చేరే నాయకులకు పార్టీ సిద్ధాంతం, కార్య పద్ధతులు, ప్రజల మధ్య నాయకత్వం పెంపొందించడం గురించి అవగాహన కల్పించేందుకు ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు.

తెలంగాణలో ప్రతి మండల కేంద్రంలో కార్యకర్తల సమావేశం, ట్రైనర్స్ ట్రైనింగ్ కొనసా గుతున్నాయన్నారు. ఈ శిక్షణా కార్యక్రమాల ద్వారా కార్యకర్తల సామర్థ్యం, పార్టీ సిద్ధాంతంపై అవగాహన, నాయకత్వాన్ని మరింత బలపరుస్తుందని ఆకాంక్షించారు.