ఘనంగా ‘రైతు వారం’ కార్యక్రమాలు: డీఏఓ సరిత
మహబూబాబాద్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం, ఆధునిక వ్యవసాయ పద్ధతుల ప్రోత్సాహం లక్ష్యంగా 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా సోమవారం నుండి వారం రోజులపాటు ‘రైతు వారము’ కార్యక్రమాలను నిర్వహిస్తోందని మహబూబాబాద్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సరిత తెలిపారు. జిల్లావ్యాప్తంగా 4 నుండి 9 మే వరకు కొనసాగనున్నాయి.
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడే ఈ కార్యక్రమాలలో రైతులకు నేల ఆరోగ్య పరిరక్షణ, సమతుల్య ఎరువుల వినియోగం, ప్రకృతి వ్యవసాయం, సేంద్రీయ సాగు, ఉద్యాన పంటల సాగు, ఆయిల్ పామ్ విస్తరణ, వ్యవసాయ యాంత్రీకరణ, సోలార్ పంప్ సెట్లు, డ్రోన్ వినియోగం వంటి అంశాలపై అవగాహన కల్పించబడుతుందన్నారు. అలాగే బ్యాంకు రుణాలు, సబ్సిడీలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, పశుసంవర్ధక, మత్స్య, నీటిపారుదల శాఖల పథకాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడతాయన్నారు.
సోమవారం నేల ఆరోగ్య పరిరక్షణ, సమతుల్య ఎరువుల యాజమాన్యం, ప్రకృతి వ్యవసాయం, సేంద్రీయ సాగుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మంగళవారం ఉద్యాన పంటల సాగు, ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంపుదల, ప్రాధాన్యంపై కార్యక్రమాలు, బుధవారం బ్యాంకుల ద్వారా రుణాలు, సబ్సిడీలు, ఎఫ్‌పీవోలు మరియు రైతు ఉత్పత్తిదారుల సంస్థలపై అవగాహన, గురువారం వ్యవసాయ యాంత్రీకరణ, సోలార్ పంప్ సెట్లు, డ్రోన్ల వినియోగంపై ప్రదర్శనలు, శుక్రవారం పశుసంవర్ధక, మత్స్య, నీటిపారుదల శాఖల ద్వారా సమగ్ర అవగాహన కార్యక్రమాలు, శనివారం
నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో సాగునీటి వినియోగం, కాలువల నిర్వహణపై కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి సరిత మాట్లాడుతూ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆధునిక సాంకేతికతలు, ప్రభుత్వ పథకాలు మరియు వ్యవసాయ రంగంలో అందుబాటులో ఉన్న అవకాశాలపై అవగాహన పొందాలని కోరారు.






