‘భవిష్యత్తు మన చేతుల్లోనే’ రాష్ట్ర స్థాయి వ్యాస రచనలో కేసముద్రం విద్యార్థిని ప్రతిభ
కేసముద్రం,(విజయక్రాంతి): కేసముద్రం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని టి. సుప్రియ రాష్ట్ర స్థాయి వ్యాస రచన పోటీలో ప్రతిభ కనబరిచి ద్వితీయ బహుమతి సాధించింది. శ్రీ సత్య సాయి సేవా సంస్థ, మహబూబాబాద్ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీకి ‘భవిష్యత్తు మనం ప్రస్తుతం చేసే పనులపై ఆధారపడి ఉంటుంది’ అనే అంశం ఇవ్వబడింది.
ఈ పోటీలో బి.ఎస్.సి (ఎంసీసీఎస్) చదువుతున్న సుప్రియ తన రచన ద్వారా విశేషంగా ఆకట్టుకుని రాష్ట్ర స్థాయిలో రెండవ స్థానం పొందింది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన వాలెడిక్టరీ కార్యక్రమంలో ఐఏఎస్ అధికారి ఎన్. భవాని శ్రీ చేతుల మీదుగా సుప్రియ బహుమతి, ప్రశంసా పత్రాన్ని అందుకుంది. ఈ విజయంపై కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. రాజు విద్యార్థినిని అభినందిస్తూ, ఆమె సాధన ఇతర విద్యార్థులకు ఆదర్శమని పేర్కొన్నారు.
అలాగే కళాశాల అధ్యాపకులు, శ్రీ సత్య సాయి సేవా సంస్థ, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు సామల శ్రీనివాస్ జిల్లా సేవాదళ్ కోఆర్డినేటర్ తవిశి ఉపేందర్, అధ్యాపకేతర సిబ్బంది సుప్రియకు శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థిని సాధించిన ఈ విజయంతో కళాశాలకు మంచి పేరు రావడంతో పాటు, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలను అధిరోహించాలని అందరూ ఆకాంక్షించారు.






