3 May, 2026 | 6:37 PM

ప్రజల అభివృద్ధే ప్రజాప్రభుత్వ ప్రధాన లక్ష్యం

03-05-2026 05:18 PM

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి 

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): ప్రజల జీవితాల్లో ప్రత్యక్షంగా మార్పు తీసుకురావడమే అసలైన రాజకీయమని, కనిపించే అభివృద్ధి మాత్రమే శాశ్వతమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. రాజకీయాలు తాత్కాలికమైతే, అభివృద్ధి శాశ్వతమని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, నగర మేయర్ గుండు సుధారాణి లతో కలిసి 60వ డివిజన్ పరిధిలో సుమారు రూ.3.50 కోట్ల పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నాయిని శ్రీకారం చుట్టారు.

ఈ పనుల్లో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం, ఆధునిక సీసీ డ్రైనేజీ, వడ్డేపల్లి ప్రాంతంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కాలనీల్లో పర్యటించిన ఎమ్మెల్యే స్థానిక ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, తక్షణ పరిష్కారాలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాలనీ ప్రజలు, కమిటీ సభ్యులతో కలిసి పనులకు శంకుస్థాపనలు చేశారు. ప్రజల అవసరాలే ప్రభుత్వ ప్రాధాన్యత అని, పార్టీలు, రాజకీయాలు పక్కన పెట్టి ప్రతి డివిజన్‌లో సమాన అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు.

కార్పొరేటర్ల పదవీకాలం ముగియబోతున్న సందర్భంలో కూడా వారు చూపిన సహకారం వల్లే గత రెండేళ్లలో గణనీయమైన అభివృద్ధి సాధ్యమైందని ఆయన అభినందించారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా వడ్డేపల్లి వంటి ప్రాంతాలు అభివృద్ధిలో వెనుకబడ్డాయని, ఇప్పుడు వాటిని తిరిగి ముందుకు తీసుకురావడం లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో రహదారులు, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, విద్య రంగాల్లో మరిన్ని ప్రాజెక్టులు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయం రంగాల్లో సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తోందని, అదే దిశగా నియోజకవర్గంలో కూడా వేగవంతమైన అభివృద్ధి కొనసాగుతుందని తెలిపారు.