3 June, 2026 | 4:08 PM

గ్రామ, వార్డు సభల్లో కీలక అంశాలపై విస్తృతంగా చర్చించాలి

03-06-2026 03:22 PM

జిల్లా కలెక్టర్ కె. హరిత

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో జూన్ 4, 6, 8, 10 తేదీలలో నిర్వహించనున్న గ్రామ, వార్డు సభల్లో పలు కీలక అంశాలపై సమగ్రంగా చర్చించాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరం నుండి అన్ని మండలాల అధికారులు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగమైన 99 రోజుల యాక్షన్ ప్లాన్‌ను సమర్థవంతంగా అమలు చేసే దిశగా ఈ సభలను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…

తాగునీటి సరఫరా – నాణ్యత:

వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీరు కలుషితం కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు. పైప్‌లైన్ లీకేజీలు ఉన్నచోట వెంటనే మరమ్మతులు చేపట్టాలని, క్లోరినేషన్ ప్రక్రియ నిరంతరంగా కొనసాగించాలని ఆదేశించారు.

పరిశుభ్రత – డ్రైనేజీల నిర్వహణ:

గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో వీధులు, మురికి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించారు. నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి దోమల నివారణకు ఫాగింగ్, స్ప్రేయింగ్ చేపట్టాలని తెలిపారు. మురికి కాలువల పూడికతీత పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.

వ్యవసాయం – విత్తనాలు, ఎరువులు:

వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో అందుబాటులో ఉండేలా చూడాలని పేర్కొన్నారు. నకిలీ విత్తనాల అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.

ఓటరు నమోదు ప్రక్రియ:

ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు బూత్ లెవెల్ అధికారులు (BLOలు) ఓటరు నమోదు, సవరణల ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా గ్రామ సభల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

వైద్య ఆరోగ్యం – టీబీ నిర్మూలన:

గ్రామాల్లో టీబీ వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి తగిన వైద్య సేవలు, ప్రభుత్వం అందించే పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

సంక్షేమ పథకాలు – ప్రగతి పనులు:

99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా పెండింగ్‌లో ఉన్న సంక్షేమ, అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు అవసరమైన రుణాలు, ప్రోత్సాహకాలు అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ (స్థానిక సంస్థలు), జెడ్పీ సీఈఓ, డీఆర్‌డీఓ, డీపీఓ, మున్సిపల్ కమిషనర్లు, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ, వ్యవసాయ, వైద్య ఆరోగ్య శాఖల అధికారులు తదితర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.