5 August, 2026 | 1:40 AM

‘ఈ20’పై కేజ్రీవాల్ ఉద్యమ బాట

05-08-2026 12:47 AM
  1. ‘ఇథనాల్ ’విధానానికి వ్యతిరేకంగా ఢిల్లీలో ‘ఆప్’ ర్యాలీ
  2.   2.38 లక్షల మంది సంతకాల సేకరణ
  3. ప్రధానికి నివేదించేందుకు పాదయాత్రగా మోదీ నివాసానికి..
  4. అడ్డుకున్న పోలీసులు.. రోడ్డుపై బైఠాయింపు.. ధర్నా
  5. ట్రంప్ ఒత్తిళ్లకు ప్రధాని లొంగి ఈ౨౦ అమలు: కేజ్రీవాల్

న్యూఢిల్లీ, ఆగస్టు 4: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ20 (ఇథనాల్ బ్లెండెడ్) పెట్రోల్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఉద్యమబాట పట్టారు. మంగళవారం ఈ మేరకు ఢిల్లీలో మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, జాస్మిన్ షా ఇతర నేతలతో కలిసి ప్రదర్శన నిర్వహించారు. ఆప్ కార్యాలయం వద్ద మొదలైన ర్యాలీ, ప్రధాని మోదీ నివాసం వరకు చేరుకుంది. అక్కడ పోలీసులు వారిని అడ్డుకున్నారు.

దీంతో ఆప్ నేతలు రోడ్డుపై బైఠాయించారు. ఈ20 పెట్రోల్ వినియోగిస్తే వాహనదారులు నష్టపోతారని, అందుకు సాక్ష్యంగా 2.38 లక్షల మంది సంతకాలు సేకరించానని కేజ్రీవాల్ వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిళ్లకు ప్రధాని మోదీ లొంగిపోయారని, ట్రంప్‌కు భయపడే ప్రధాని ‘ఈ20’ విధానాన్ని ప్రజలపై రుద్దుతున్నారని ఆరోపించారు. కేంద్రప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, అమెరికా నుంచి ఇథనాల్ కొనుగోలు ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

ఈ20 పెట్రోల్ వినియోగిస్తే, వాహనాలు మరమ్మతులకు గురవుతాయని, వాహనాల మైలేజీ కూడా తగ్గుతుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్ సాక్షిగా అంగీకరించిందని గుర్తుచేశారు. కేంద్రం పట్టుబట్టి అమలు చేయాలనుకుంటే పెట్రోల్ బంకుల్లో ఈ౨౦ పెట్రోల్‌తోపాటు సాదా పెట్రోల్‌కూడా అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. వినియోగదారులు తమకు నచ్చిన ఇంధనం వినియోగించుకునే వెసులుబాటు కల్పించాలని కోరారు.

ఈ విషయాలన్నీ ప్రధాని మోదీకి తెలపాలని, నెల రోజుల కిందటే అపాయింట్‌మెంట్ కోరానని, అయినప్పటికీ తనకు అపాయింట్‌మెంట్ లభించలేదని మండిపడ్డారు. ఈ20కి వ్యతిరేకంగా ఇప్పటికే పంజాబ్ అసెంబ్లీలో తీర్మానం చేశామని, త్వరలోనే గుజరాత్, గోవా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీల్లోనూ ఆప్ ఎమ్మెల్యేలు తీర్మానాలు ప్రవేశపెడతారని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే దేశవ్యాప్త ఆందోళన చేపడతామని హెచ్చరించారు.