ప్రశాంత్ కిశోర్ గెలుపు మర్మం
- బంకీపూర్ ఉప ఎన్నికలో ‘జన సురాజ్’ విజయ బావుటా
- ౩౦ రోజుల్లోనే ౩ దశాబ్దాల కమలం కంచుకోట బద్దలు
- పక్కాగా ‘పీకే’ వ్యూహాలు.. ప్రజా సమస్యలే ప్రచారాస్త్రాలు
- ఆర్జేడీ సంప్రదాయ ఓట్లు, ముస్లిం ఓట్లు రాబట్టడంలో సక్సెస్
పాట్నా, ఆగస్టు ౫: బీహార్‌లోని బంకీపూర్ ఉప ఎన్నికలో జన్ సురాజ్ పార్టీ విజయం దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఎన్నికల బరిలో మొదటిసారి ఆ పార్టీ బోణీ కొట్టింది. పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ (పీకే) 19,324 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి నీరజ్‌కుమార్ సిన్హాపై గెలుపొందారు. తద్వారా ౩0 ఏళ్ల నుంచి ఆ నియోజకవర్గంలో పాగా వేసిన బీజేపీని మట్టికరిపించారు. ఈ గెలుపు రాష్ట్రంలో సీఎం సామ్రాట్ చౌదరి పాలనకు, ఆయన నాయకత్వంపై వచ్చిన వ్యతిరేకతగా విశ్లేషకులు చెబుతున్నారు.
ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత సామ్రాట్ చౌదరికి ఇది మొదటి ఎన్నిక. సీఎం కూడా ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నప్పటికీ, ప్రశాంత్‌కిశోర్ ఎత్తుల ముందు సీఎం, బీజేపీ నేతల పాచికలు పారలేదు. ప్రశాంత్ కిశోర్ కేవలం ౩౦ రోజుల క్యాంపెయినింగ్ చేసి విజయం సాధించారు. సీఎం సామ్రాట్ చౌదరి విద్యార్హతలు, ఆయనపై ఉన్న పాత కేసులు, పసలేని పరిపాలనా సామర్థ్యంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఈ అసెంబ్లీ స్థానం 30 ఏళ్లకు పైగా బీజేపీకి కంచుకోటగా ఉంది. ప్రస్తుత పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు నితిన్ నబీన్ ఈ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతకుముందు ఆయన తండ్రి నవీన్ కిషోర్‌ప్రసాద్ సిన్హా అనేకసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర కూడా ఉంది. ఒకే కుటుంబం ప్రాతినిధ్యంలో దశాబ్దాలుగా ఉన్న ఈ నియోజకవర్గం, పెద్దగా అభివృద్ధి చెందలేదనే విమర్శలున్నాయి.
పారిశుధ్య సమస్యలు, అధ్వాన్నమైన రోడ్లు, తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు, నిరుద్యోగం వంటి సమస్యలు ఎక్కడికక్కడ పేరుకుపోయి ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ ప్రశాంత్ కిశోర్ తన ప్రచారాస్త్రాలుగా మార్చుకున్నారు. పెద్ద పెద్ద హామీలు ఇవ్వకుండా, తాను చేయగలిగిన పనులు మాత్రమే నిజాయతీగా చాటిచెప్పారు. తద్వారా నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని సాధించగలిగారు.
ఆర్‌జేడీ సంప్రదాయ ఓటు బ్యాంకులో చీలిక
రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌జేడీ)కి చెందిన నియోజకవర్గ సంప్రదాయ ముస్లిం, -యాదవ ఓటు బ్యాంకు జన్‌సురాజ్ పార్టీ వైపు మళ్లడం పీకేకి కలసి వచ్చింది. ఈ ఎన్నికల్లో ముస్లిం ఓటర్లు బీజేపీని ఓడించడమనే లక్ష్యం పెట్టుకున్నారు. ఆర్‌జేడీ కంటే బీజేపీని గట్టిగా ఢీకొట్టగలరని వారు పీకేకు మద్దతు పలికారు. ఫలితంగా ఆర్‌జేడీ అభ్యర్థి రేఖా కుమారి కేవలం 14,000 ఓట్లు సాధించి మూడో స్థానానికి పరిమితమయ్యారు. ప్రతిపక్ష ఓట్లు ఆర్‌జేడీకి పడకుండా ఒకే చోట కేంద్రీకతమవ్వడం ప్రశాంత్ విజయాన్ని సులభతరం చేసింది.
అలాగే, నియోజకవర్గంలో కాయస్థ, బ్రాహ్మణ సామాజిక వర్గాలు గతంలో బీజేపీ ప్రధాన బలంగా ఉండేవి. ఈసారి ఆ ఓటు బ్యాంకులో స్పష్టమైన చీలిక వచ్చింది. పీకే స్వయంగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆ వర్గం పీకే వైపు మళ్లింది. మరోవైపు బీజేపీ తొలుత ఒక అభ్యర్థిని ప్రకటించి, వివాదాల వల్ల నీరజ్‌కుమార్ సిన్హాను మార్చడం పార్టీలోని ముసలం పుట్టింది. ప్రశాంత్ ఆలోచనలు కూడా పార్టీ విజయానికి బాటలు వేశాయి.






