2,000 దాటితే అదనపు ఛార్జీలు?
- యూపీఐ విధానంలో కీలక మార్పులు?
- ఎండీఆర్‌పేరిట లావాదేవీపై.3-% నుంచి 0.5% మేర వడ్డింపు
- 1.5 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న వ్యాపారులకు వర్తింపు
న్యూఢిల్లీ, ఆగస్టు 4: భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) విధానంలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 1.5 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న వ్యాపారులు రూ.2,000 కంటే ఎక్కువ లావాదేవీ చేస్తే, వారిపై 0.3% నుంచి 0.5% మేర మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) పేరుతో కేంద్రం అదనపు చార్జీ విధించనుంది.
ఈ మేరకు కేంద్రం ఇప్పటికే చట్టంలో సవరణలను ప్రతిపాదించింది. అయితే.. కొత్త విధానంతో సాధారణ వినియోగదారులపై ఎలాంటి అదనపు భారం పడే అవకాశం లేదు. చిన్న చిన్న వ్యాపారులు, కిరాణా దుకాణాదారులు, సామాన్య ప్రజలు జరిపే రోజువారీ డిజిటల్ చెల్లింపులు ఎప్పటిలాగే పూర్తిగా ఉచితంగానే కొనసాగుతాయి. వ్యాపారుల వార్షిక టర్నోవర్‌ను బట్టే అదనపు చార్జీల వడ్డింపు ఉంటుందనేది సుస్పష్టం.
రోజురోజుకూ యూపీఐ చెల్లింపులు పెరుగుతున్నందున, ఆయా వ్యవస్థల నిర్వహణకు కొంత సొమ్ము అవసరం. ఈ కారణంతోనే కేంద్రం అదనపు చార్జీల విధింపునకు కొత్త చట్టం అమలు చేయనున్నట్టు చర్చ జరుగతున్నది. ఒక్క జూలైలోనే యూపీఐ ద్వారా రూ.29.9 ట్రిలియన్ల విలువైన 23.6 బిలియన్ లావాదేవీలు జరిగాయి.
ఈ లావాదేవీల్లో రూ.2,000 దాటిన పేమెంట్స్ కేవలం 4 శాతం మాత్రమే. ఈ తరహా పెద్ద లావాదేవీలపై ఎండీఆర్ విధించడం ద్వారా డిజిటల్ చెల్లింపుల రంగానికి ఏటా రూ.5,000 కోట్ల నుంచి రూ.10,000 కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. కేంద్రం అధికారికంగా కొత్త విధానం ప్రకటించే వరకు ప్రస్తుత ఉచిత పీఐ విధానమే కొనసాగుతుంది.






