మద్దూరు KGBVలో 18 మంది విద్యార్థినులకు తీవ్ర అస్వస్థత
చేర్యాల,(విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (Kasturba Gandhi Balika Vidyalaya)లో ఆదివారం రాత్రి దాదాపు 18 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థినులకు వాంతులు, విరేచనాలు రావడంతో తోటి విద్యార్థులు,కేజిబివి సిబ్బంది అప్రమమై వారితో పాటు 108 సిబ్బంది EMT శ్రీకాంత్, వెంకట్, పైలట్లు అర్జున్, ఇంతియాజ్ అందరినీ చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వైద్యుల పర్యవేక్షణ
చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. దేవేందర్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది విద్యార్థినులకు అవసరమైన పరీక్షలు చేసి చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
కారణంపై అనుమానాలు
విద్యార్థినులు అస్వస్థతకు గురికావడానికి కలుషిత ఆహారమే కారణమా లేక మరేదైనా ఇతర కారణాలా అన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. వైద్య పరీక్షల నివేదికలు, అధికారుల విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
అధికారుల సందర్శన
ఘటన విషయం తెలుసుకున్న మద్దూరు ఎంపీడీఓ రామ్మోహన్ వెంటనే స్పందించి తక్షణ చర్యలు తీసుకున్నారు. చేర్యాల సిఐ రమేష్ నాయక్, కేజిబివి డిసిఓ నర్మద ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.






