తారాపీఠ్‌లో భారీ అగ్నిప్రమాదం: ఏడుగురు సజీవ దహనం
తారాపీఠ్: పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఒక హోటల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో కనీసం ఏడుగురు మరణించగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. పుణ్యక్షేత్రమైన తారాపీఠ్‌లోని( Tarapith Temple) నాలుగు అంతస్తుల హోటల్ గ్రౌండ్ ఫ్లోర్‌లో, అతిథులందరూ దాదాపుగా నిద్రపోతున్న సమయంలో ఉదయం 5 గంటల ప్రాంతంలో ఈ అగ్నిప్రమాదం సంభవించిందని పేర్కొన్నారు. అగ్నిమాపక వాహనాలను హుటాహుటిన ఘటనా స్థలానికి తరలించి, మంటలను అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారిని రాంపూర్హత్ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రికి తరలించారు. ఈ అగ్నిప్రమాదంలో ఐదుగురు మరణించారని ఆసుపత్రి వర్గాలు మొదట తెలిపాయి. అయితే, తర్వాత పోలీసులు మృతుల సంఖ్య ఏడు అని సవరించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం సంభవించిందని హోటల్ అధికారులు పేర్కొన్నారు.






