కడిగిన ముత్యంలా బయటకు వచ్చా
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో(Delhi liquor policy case) తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై(Kalvakuntla Kavitha) సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నమోదు చేసిన కేసులను రౌస్ అవెన్యూ కోర్టు(Delhi Rouse Avenue Court) కొట్టివేసింది. దీంతో కవితకు భారీ ఊరట లభించింది. కోర్టు తీర్పు అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ ప్రజలకు నేను మొదట్నుంచి చెప్తున్నాను.. కడిగిన ముత్యం వలే బయటకి వస్తానని అప్పుడే చెప్పానని వెల్లడించారు. న్యాయవ్యవస్థపై తాను పెట్టుకున్న నమ్మకం నిలబడిందన్నారు. ఇది కేవలం రాజకీయ కక్షతో పెట్టిన కేసు అని ఎన్నో సార్లు చెప్పానని వివరించారు. మాజీ సీఎం కేసీఆర్(Former CM KCR), బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడానికే తనపై కేసు పెట్టారని ఆరోపించారు.
ఈ కేసు వల్ల నేను, నా కుటుంబం కొన్ని నెలల పాటు క్షోభ అనుభవించామని తెలిపారు. కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన అందరికీ కవిత ధన్యవాదాలు తెలిపారు. మరింత ఉత్సాహంతో ప్రజలకు సేవ చేస్తానని కవిత అన్నారు. తన కుటుంబానికి దూరమై 5 నెలల జైలులో గడిపిన సమయాన్ని ఎవరు తిరిగిస్తారు? అని కవిత ప్రశ్నించారు. కోర్టు తీర్పు రాకుండానే కొందరు తనపై అనుచితంగా మాట్లాడారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తనపై అనుచిత పోస్టులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం కేసులో నిందితుల డిశ్చార్జ్ పిటిషన్లపై 45 రోజుల పాటు వాదనలు సాగాయి. మద్యం కేసులో కోర్టు తీర్పు తర్వాత కవిత ఎక్స్ లో ''సత్యమేవ జయతే'' అని పోస్టు చేశారు. మద్యం కేసులో కోర్టు తీర్పుపై కవిత కుమారుడు దేవనపల్లి అనిల్ ఆదిత్య(Devanapalli Anil Aaditya) మాట్లాడుతూ, చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా రాజకీయ ప్రేరేపిత కేసు చివరకు ముగిసిందన్నారు. కోర్టు తీర్పుతో కవిత నివాసం వద్ద తెలంగాణ జాగృతి మద్దతుదారులు సంబురాలు చేసుకున్నారు.




