కౌశిక్‌రెడ్డికి సమాధానం చెప్పుకునే అవకాశమివ్వాలి
- ఎథిక్స్ కమిటీలో మా వాదన బలంగా వినిపించాం
- సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపైనా చర్చించాలి
- మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 29 (విజయక్రాంతి): కౌశిక్‌రెడ్డిపై చర్యలకు ముందుగా ఆయనకు ఎథిక్స్ కమిటీకి తన వాదనను వినిపించే అవకాశం ఇవ్వాలని కోరినట్టు మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సమావేశంలో బీఆర్‌ఎస్ తరఫున తమ వాదనను బలంగా వినిపించామని పేర్కొన్నారు.
అసెంబ్లీ ఆవరణలో శనివారం ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. పాడి కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యల వివాదాన్ని ఎథిక్స్ కమిటీకి తీసుకురావడంలో అనుసరించిన విధానాన్ని ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. వివాదం జరిగిన రోజున అసెంబ్లీలో 23 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో మాత్రమే మాట్లాడించారని, దీనిని ‘మూడ్ ఆఫ్ ది హౌస్’గా ఎలా పరిగణిస్తారని నిలదీశారు.
కేవలం కాంగ్రెస్ సభ్యుల వాదనల ఆధారంగానే కౌశిక్‌రెడ్డి అంశాన్ని ఎథిక్స్ కమిటీ సమావేశం ఎజెండాలో చేర్చారని ఆరోపించారు. పాడి కౌశిక్‌రెడ్డి అంశంపై ఎథిక్స్ కమిటీ చర్చిస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి అసభ్య పదజాలం ఉపయోగించిన అంశంపైనా చర్చించాలని కమిటీ చైర్మన్‌ను కోరినట్టు తెలిపారు.
రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, దానం నాగేందర్, ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, మందుల సామేల్ అసెంబ్లీలో అనుచితంగా మాట్లాడటం, ప్రవర్తించడంపై ఎథిక్స్ కమిటీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశామని చెప్పారు. తమ ఫిర్యాదుకు ఆధారంగా ఆయా నేతలు అసెంబ్లీలో మాట్లాడిన వీడియోలను కూడా కమిటీకి సమర్పించినట్టు వెల్లడించారు.
తమ విజ్ఞప్తిపై నిర్ణయం తీసుకుంటామని ఎథిక్స్ కమిటీ చైర్మన్ హామీ ఇచ్చారని తెలిపారు. బీజేపీ, బీఆర్‌ఎస్ సభ్యులు పరస్పరం సహకరించుకుంటున్నారంటూ ఎథిక్స్ కమిటీలో కాంగ్రెస్ సభ్యుడు చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టంచేశారు. ఇది కేవలం రాజకీయ ఆరోపణ మాత్రమేనని కొట్టిపారేశారు.
కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి గత ప్రభుత్వం అమలు చేసిన అన్ని పథకాలు కొనసాగుతున్నాయని చెప్పడంలో వాస్తవం లేదని వ్యాఖ్యానించారు. రైతు బీమాకు ప్రీమియం చెల్లించకుండా ప్రభుత్వం ఆ పథకాన్ని నిలిపివేసిందని ఆరోపించారు. మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై ప్రస్తుతం ఏం జరుగుతుందో తనకు తెలియదని అన్నారు.
రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై పార్టీలు, నేతల మధ్య జరుగుతున్న పరిణామాలను పరిశీలించాల్సి ఉందన్నారు.






