మిల్లర్ల ‘చౌక’మార్గం!
- ధాన్యం స్వాహా.. బియ్యం కోసం దొడ్డిదారి
- సీఎంఆర్ బకాయిలపై ప్రభుత్వం కఠిన వైఖరి
- కేసులు, ఫెనాల్టీల భయంతో మిల్లర్ల కొత్త ఎత్తుగడ
- తక్కువ ధరకు రేషన్ బియ్యం కొనుగోలు
- రీసైక్లింగ్ చేసి సీఎంఆర్ కోటాలోకి మళ్లింపు!
- పోలీసుల దాడుల్లో బట్టబయలు
- (బండి సంపత్‌కుమార్)
మహబూబాబాద్, ఆగస్టు 29 (విజయక్రాంతి): కస్టం మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) వ్యవహారం రైస్ మిల్లర్లకు తలపోటుగా మారింది. ప్రభుత్వం కస్టం మిల్లింగ్ కోసం అప్పగించిన ధాన్యాన్ని అప్పగించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి తిరిగి ఇవ్వాల్సిన మిల్లర్లు.. ఇప్పుడు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. సీఎంఆర్ బకాయిలపై సీఎం రేవంత్‌రెడ్డి కఠిన వైఖరి అవలంబించడంతో లెక్కల సేకరణ, బకాయిల వసూళ్ల ప్రక్రియను పౌరసరఫరాల శాఖ వేగవంతం చేసింది.
2021 నుంచి 2025 వానాకాలం, యాసంగి సీజన్ వరకు మిల్లర్లకు కేటాయించిన ధాన్యం, మిల్లర్లు తిరిగి ఇచ్చిన బియ్యం వివరాలను సమగ్రంగా సేకరించే పనిలో పడింది. డిఫాల్ట్ మిలర్ల నుంచి అదనంగా 25 శాతం పెనాల్టీ వసూలు చేయడానికి సిద్ధమవుతోంది. దీనితో ధాన్యం పక్కదారి పట్టించిన మిల్లర్లు.. కేసులు, ఫెనాల్టీ భయంతో బియ్యం సమకూర్చుకునేందుకు తంటాలు పడుతున్నారన్న ఆరోపనలు వినిపిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు మిల్లర్లు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
పెరిగిన ధాన్యం ధరలు.. మిల్లర్లకు మరింత భారం
ధాన్యం ధరలు పెరగడంతో మిల్లర్లకు ఆర్థికంగా కష్టాలు తప్పడం లేదు. అప్పట్లో క్వింటా ధాన్యం రూ.2,100 రూ.2,400 వరకు ఉండగా, ప్రస్తుతం అదే ధాన్యం రూ.3000కు చేరింది. ఫలితంగా మిల్లంగ్ వ్యయం కూడా భారీగా పెరిగింది. ధాన్యం ఖరీదు చేసి బియ్యం పట్టిస్తే క్వింటాకు రూ.50 వరకు ఖర్చు వస్తుండడంతో సీఎంఆర్ బకాయిలు చెల్లించడం మిల్లర్లకు కష్టంగా మారింది.
దీంతో కొందరు మిల్లర్లు రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు పంపిణీ చేసిన సన్నబియ్యం కొనుగోలు చేసి రీసైక్లింగ్ వ్యవహారానికి తెరలేపినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం 2025లో యాసంగి, వానాకాలం సీజన్‌లో సీఎంఆర్ కోసం ఇచ్చిన సన్న ధాన్యం మిల్లింగ్ చేస్తే కేవలం 40 నుంచి 50 కిలోల బియ్యం మాత్రమే అవుట్ టర్న్ రావడం కూడా మిల్లర్లకు సమస్యగా మారినట్లు తెలుస్తోంది.
మిల్లింగు నిర్వహణ, ఆర్థికంగా నష్టపోకుండా గట్టెక్కాలంటే బియ్యం రీసైక్లింగ్ చేస్తే తప్ప మరో అవకాశం లేదని, ఈ క్రమంలో రేషన్ షాపుల ద్వారా ప్రజలకు పంపిణీ చేసే సన్న బియ్యం కిలోకు రూ.20 చొప్పున కొనుగోలు చేసి రీసైక్లింగ్ చేస్తున్నారు. ఇటీవల మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో పోలీసుల దాడుల్లో రీసైక్లింగ్ బాగోతం బట్టబయలైంది. 25 క్వింటాళ్ల సన్న బియ్యం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఇటీవల సన్న బియ్యం అక్రమ నిల్వలను పోలీసులు గుర్తించారు.
కొత్త గన్నీ బ్యాగుల్లో నింపి సీఎంఆర్ కోటాలోకి..
రేషన్ షాపుల ద్వారా చౌక ధరకు కొనుగోలు చేసిన సన్న బియ్యాన్ని ఎవరికీ అనుమానం రాకుండా కొత్త గన్నీ బ్యాగుల్లో నింపి పౌరసరఫరాల సంస్థకు సీఎంఆర్ కోటా కింద అందజేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా నష్టాల నుంచి కొంతవరకైనా బయటపడవచ్చని ఆలోచనతో కొందరు మిల్లర్లు అడ్డదారులు తొక్కుతూ ‘రీసైక్లింగ్’ దందాకు శ్రీకారం చుట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల అనేక జిల్లాల్లో సివిల్ సప్లై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీలు ముమ్మరంగా సాగిస్తున్నారు.
ధనికుల రేషన్ కార్డుల వల్లే బియ్యం పక్కదారి
సామాన్యులకు ఇచ్చిన రేషన్ కార్డుల్లో దాదాపు 30 శాతానికి పైగా ధనికుల చేతుల్లో ఉన్నాయని, బియ్యం కోసం కాకుండా ఇతర ప్రభుత్వ ప్రయోజనాల కోసం రేషన్ కార్డులు పొందారని, అటువంటి వారు ప్రభుత్వం అందజేస్తున్న సన్న బియ్యం తినడానికి పెద్దగా ఆసక్తి చూపడంలేదు. వారి నుంచి సన్న బియ్యంకిలో రూ.20 వరకు కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. బియ్యం సేకరించి ఇచ్చిన రేషన్ డీలర్లకు కిలోకు రూ.2 చొప్పున కమిషన్ ఇస్తూ, వాటిని కొత్త గన్నీ సంచుల్లో నింపి అన్ని ఖర్చులతో కలుపుకొని 30 రూపాయలకు బియ్యం వస్తున్నట్లు చెబుతున్నారు.
ఇలా ధాన్యాన్ని మిల్లు పట్టకుండానే తక్కువ ఖర్చుతో బియ్యం ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం దొడ్డు బియ్యానికి బదులు సన్నబియ్యం ఇచ్చినా కొందరు తినకుండా అమ్ముకోవడంతో రీసైక్లింగ్ దందాకు ఊతమిస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సన్న బియ్యం పక్కదారి పట్టించే వ్యవహారంపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని, అప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని పలువురు పేర్కొంటున్నారు.






