11 August, 2026 | 6:19 PM

రోడ్డు ప్రమాదంలో కారోబార్ కృష్ణ మృతి బాధాకరం

11-08-2026 05:42 PM

* చిన్నారిని ఎత్తుకుని కంటతడి పెట్టిన పద్మాదేవేందర్‌రెడ్డి

* అంత్యక్రియలు పూర్తయ్యేంతవరకు కుటుంబ సభ్యులతో ఉన్న పద్మారెడ్డి

పాపన్నపేట: మండల కేంద్రం పాపన్నపేట గ్రామ పంచాయతీ కారోబారుగా విధులు నిర్వహిస్తున్న ఆకుల కృష్ణ(42) యూసఫ్పేట శివారులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం బాధాకరమని మాజీ  ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం యూసఫ్పేట శివారులో రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో కృష్ణ మృతిచెందిన విషయం తెలుసుకున్న పద్మాదేవేందర్‌రెడ్డి మంగళవారం పాపన్నపేటకు చేరుకుని కృష్ణ అంత్యక్రియల్లో పాల్గొని నివాళులర్పించారు.

అనంతరం కృష్ణ భార్య, కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. కృష్ణకు తొమ్మిది నెలల చిన్నారి ఉండటాన్ని చూసి పద్మాదేవేందర్‌రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. చిన్నారిని ఎత్తుకుని కంటతడి పెట్టారు. కృష్ణ సోదరులైన మాజీ ఎంపీటీసీ ఆకుల శ్రీనివాస్, వెలుగు దినపత్రిక విలేకరి ఆకుల భాస్కర్‌లను ఓదార్చి ధైర్యం చెప్పారు. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అక్కడే ఉండి కుటుంబ సభ్యులకు అండగా నిలిచారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తొమ్మిది నెలల చిన్నారిని చూసి తన మనస్సు కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణ కుటుంబానికి ఈ విషాదాన్ని తట్టుకునే శక్తి, మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించారు. వీరి వెంట పార్టీ మండల అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు గురుమూర్తి గౌడ్, మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు తాడేపు సోములు, నాయకులు కాశీనాథ్‌రావు, ఉప్పరి వెంకటేశం, రంగంపేట శ్రీనివాస్ తదితరులున్నారు.