11 August, 2026 | 6:55 PM

ప్రభుత్వ విద్యారంగ సంక్షోభం దేశ భవిష్యత్తుకు ప్రమాదకరం

11-08-2026 05:56 PM

విద్య పట్ల పాలక ప్రభుత్వాలు నిర్లక్ష్యాన్ని విడనాడాలి: పీడీఎస్‌యూ

ఇల్లెందు, (విజయక్రాంతి): ప్రభుత్వ విద్యారంగంలో నెలకొన్న సంక్షోభం దేశ భవిష్యత్తుకు ప్రమాదకరమని, విద్య పట్ల పాలక ప్రభుత్వాలు నిర్లక్ష్యాన్ని విడనాడాలని పీడీఎస్‌యూ జిల్లా నాయకులు గంగాధర్ గణేష్ అన్నారు. ఇల్లందు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో “విద్యారంగ సమస్యలు–విద్యార్థుల భవిష్యత్తు” అనే అంశంపై పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ఆయుష్ అధ్యక్షతన సెమినార్ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యవక్తగా హాజరైన గంగాధర్ గణేష్ మాట్లాడుతూ.. విద్య ప్రతి పౌరుడి హక్కు అని, దేశ అభివృద్ధికి, సామాజిక ప్రగతికి నాణ్యమైన విద్య అత్యంత కీలకమని అన్నారు. అయితే ప్రభుత్వ విద్యారంగం అనేక సమస్యలను ఎదుర్కొంటోందని, వాటిని పరిష్కరించడంలో పాలక ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని విమర్శించారు.

ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కొరత, ఉపాధ్యాయుల ఖాళీలు, పెరుగుతున్న ఫీజులు, ప్రైవేటు విద్యాసంస్థలపై నియంత్రణ లోపం, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో జాప్యం వంటి సమస్యలు విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తెలిపారు.విద్యార్థుల భవిష్యత్తు దేశ భవిష్యత్తుతో ముడిపడి ఉందని, విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడం అంటే భవిష్యత్ తరాలను దెబ్బతీయడమేనని అన్నారు. విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించి, అందరికీ సమానమైన, నాణ్యమైన విద్య అందేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

పీడీఎస్‌యూ నూతన కమిటీ ఎన్నిక

అనంతరం ఇల్లందు ప్రభుత్వ డిగ్రీ కళాశాల పీడీఎస్‌యూ నూతన కమిటీని ఎన్నుకున్నట్లు గంగాధర్ గణేష్ ప్రకటించారు. నూతన కమిటీ అధ్యక్షురాలిగా వెనిషిక, ఉపాధ్యక్షురాలిగా మినీ, ప్రధాన కార్యదర్శిగా లక్ష్మీనరసింహ, సహాయ కార్యదర్శిగా సికిందర్ ఎన్నికయ్యారు. కమిటీ సభ్యులుగా అక్షయ, సిద్దు, రాజేష్, స్రవంతి, రఫీ, సౌందర్య తదితరులు ఎన్నికయ్యారు.