11 August, 2026 | 7:15 PM

నాడు బీఆర్ఎస్ కబ్జాలు.. నేడు బీజేపీ దాడులు

11-08-2026 06:16 PM

ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ ను ప్రజలు నాడు బీఆర్ఎస్ కు అప్పగిస్తే కొందరు కార్పొరేటర్లు స్వయంగా భూ కబ్జాలకు పాల్పడ్డారని, నేడు బీజేపీ కి అప్పగిస్తే వ్యక్తిగత దాడులు చేస్తున్నారని సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బిఆర్ఎస్ కార్పొరేటర్లు భూ కబ్జాలకు పాల్పడ్డారని, ఇప్పుడు కొందరు బీజేపీ కార్పొరేటర్లు దాడులకు దిగుతున్నారని ఎద్దేవ చేశారు.

భాధ్యత గల పదవిలో ఉన్న బండి సంజయ్ కుమార్ జరుగుతున్న దాడులపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే అధికారిక క్యాంపు కార్యాలయం పై స్వయంగా బీజేపీ కార్పొరేటర్లు దాడి చేయడం,కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆఫీసు ముందు శాంతియుతంగా నిరసన చేద్దామని కాంగ్రెస్ నాయకులు వెళ్తే ఒక బీజేపీ కార్పొరేటర్ కర్రలతో దాడికి దిగడం,ఈ రోజు కిసాన్ నగర్ లో ఇంకొక బీజేపీ కార్పొరేటర్ కు సంబంధించిన వ్యక్తులు ఏకంగా కత్తులతో బీరు సీసాలతో దాడులకు పాల్పడ్డారని ఇటువంటి సంస్కృతి మంచిది కాదని నరేందర్ రెడ్డి అన్నారు.

పోలీసులు వెంటనే స్పందించి నిందుతులను అరెస్ట్ చేశారని ప్రజలు భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదని ఇటువంటివి పునరావృతం కాకుండా రాష్ట ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.ఈ విలేకరుల సమావేశంలో మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఎండి తాజ్,కార్పోరేటర్లు వారాల నర్సింగం,పర్వతం మల్లేశం,  తదితరులు పాల్గొన్నారు.