క్షయ రహిత సమాజమే లక్ష్యం: డాక్టర్ జివేరియా బేగం
– లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలి
నాగల్‌గిద్ద,(విజయక్రాంతి): క్షయ వ్యాధిని తొలిదశలోనే గుర్తించి, పూర్తిగా నివారించేందుకు ఎక్స్‌రే పరీక్షలు ఎంతో కీలకమని మండల వైద్యాధికారి డాక్టర్ జివేరియా బేగం తెలిపారు. నాగల్‌గిద్ద మండల పరిధిలోని కరస్‌గుత్తి, కారముంగి, శేరిదామరగిద్ద, ఇరక్‌పల్లి సబ్ సెంటర్లలో క్షయ వ్యాధి నివారణలో భాగంగా ఎక్స్‌రే పరీక్షల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా క్షయ వ్యాధి అనుమానిత లక్షణాలు ఉన్న వారికి పరీక్షలు నిర్వహించి, వ్యాధి నిర్ధారణకు చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా డాక్టర్ జివేరియా బేగం మాట్లాడుతూ.. దీర్ఘకాలంగా దగ్గు, జ్వరం, బరువు తగ్గడం, రాత్రిపూట చెమటలు వంటి లక్షణాలు ఉన్నవారు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఎక్స్‌రే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వం క్షయ వ్యాధి బాధితులకు అందిస్తున్న మందులు, ఇతర సహాయాన్ని అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తున్నామని తెలిపారు. క్రమం తప్పకుండా మందులు వాడుతూ, వైద్యుల సూచనలు పాటిస్తే క్షయ వ్యాధిని పూర్తిగా నివారించవచ్చని పేర్కొన్నారు.కార్యక్రమంలో ఆసుపత్రి సూపర్‌వైజర్ విక్టోరియా రాణి, సబ్ సెంటర్ డాక్టర్స్ పూజ, రాజశేఖర్, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొని ప్రజలకు క్షయ వ్యాధిపై అవగాహన కల్పించారు.






