కళ్యాణ లక్ష్మీ పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా
- బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
ఇచ్చోడ,(విజయక్రాంతి): కళ్యాణ లక్ష్మీ పథకం పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా అని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల తహసీల్దార్ కార్యక్రమంలో నిర్వహించిన కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై 41 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, మధ్య తరగతి కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహం ఆర్థిక భారంగా మారకూడదనే ఉద్దేశంతో కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టిన మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేదల సంక్షేమానికి దూరదృష్టితో పనిచేసిన నాయకుడని పేర్కొన్నారు.
పేద కుటుంబాల అవసరాలను ముందుగానే గుర్తించి, వారి ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేసిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. ముఖ్యంగా ఆడబిడ్డల వివాహ సమయంలో తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం అందించాలనే లక్ష్యంతో కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలను తీసుకొచ్చారని తెలిపారు. కేసీఆర్ హయాంలో ప్రారంభమైన పలు సంక్షేమ పథకాలు పేదల జీవితాల్లో మార్పు తీసుకొచ్చాయని పేర్కొన్నారు. పేద ప్రజల సంక్షేమం, వారి హక్కుల కోసం బీఆర్ఎస్ ఎల్లప్పుడూ పోరాడుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీవో, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.






