29 August, 2026 | 5:19 AM

కర్ణాటక మంత్రి నాగేంద్ర రాజీనామా

29-08-2026 02:02 AM
  1. ‘వాల్మీకి’ కుంభకోణం వ్యవహారంలో కీలక మలుపు
  2. ౨౦౨౪ మే నెలలో వెలుగులోకి స్కాం
  3. నాడు గిరిజనశాఖ మంత్రి పదవి నుంచి నాగేంద్ర ఔట్
  4. ‘డీకే’ సీఎం అయిన తర్వాత తాజాగా క్యాబినెట్‌లోకి
  5. మంత్రి పదవి కట్టబెట్టడంపై బీజేపీ, జేడీఎస్ తీవ్ర అభ్యంతరం
  6. పదవీచ్యుతుడిని చేయకపోతే పాదయాత్ర చేస్తామని హెచ్చరికలు
  7. నేను దళితుడిని కావడంతోనే టార్గెట్ అయ్యా: నాగేంద్ర

బెంగళూరు, ఆగస్టు 28: వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణం వ్యవహారంలో ప్లానింగ్, గణాంకాలశాఖ మంత్రి బీ నాగేంద్ర శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. మహర్షి వాల్మీకి పరిశిష్ట తెగల అభివృద్ధి కోసం రాష్ట్రప్రభుత్వం మూడేళ్ల క్రితం వాల్మీకి కార్పొరేషన్ ఏర్పాటు చేసింది.

కార్పొరేషన్‌కు ఖాతా నుంచి సుమారు 89.63 కోట్ల దారి మళ్లినట్టు ౨౦౨౪ మే నెలలో పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. కార్పొరేషన్ అకౌంట్స్ సూపరింటెండెంట్ చంద్రశేఖరన్ నిధుల మళ్లింపుపై ఆరోపణలు చేస్తూ ఆత్మహత్య చేసుకోవడంతో ఈ వ్యవహారమంతా బయటపడింది. సదరు సొమ్ము మొదట యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాకు, తర్వాత ఇతర ఖాతాలకు దారి మళ్లించినట్లు అధికారుల విచారణలో తేలింది.

నిధుల మళ్లింపునకు నాడు గిరిజన సంక్షేమ శాఖమంత్రిగా వ్యవహరించిన నాగేంద్ర కారణమంటూ విపక్షాలు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో నాగేంద్ర 2024 జూన్‌లో మంత్రి పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు తీసుకున్న తర్వాత, ఆయన ఈనెల ౩న మళ్లీ నాగేంద్రకు క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. నాగేంద్రకు రాష్ట్ర ప్లానింగ్, గణాంకాలశాఖ అప్పగించారు.

నాగేంద్రకు మళ్లీ మంత్రి పదవి అప్పగించడంపై విపక్షాలైన బీజేపీ, జేడీఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. నాగేంద్ర మంత్రికి రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ లోపల, వెలుపల పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టాయి. లేకపోతే సెప్టెంబర్ 1 10 వరకు రాయచూరు నుంచి బళ్లారి వరకు పాదయాత్ర చేస్తామని హెచ్చరించాయి. ఈ ఒత్తిళ్ల నేపథ్యంలోనే తాజాగా నాగేంద్ర తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

బీజేపీ నన్ను టార్గెట్ చేసింది: నాగేంద్ర

మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత నాగేంద్ర బెంగళూరులో మీడియా ఎదుటకు వచ్చి భావోద్వేగానికి గురయ్యారు. ప్రతిపక్ష బీజేపీ నుంచి వస్తున్న ఒత్తిళ్ల కారణంగానే తాను మంత్రి పదవికి రాజీనామా చేశానని కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను దళితుడిని కావడం వల్లే తననున బీజేపీ లక్ష్యంగా చేసుకుందని, నానావిధాలా కుట్రలు పన్ని తాను పదవీచ్యుతుడిని అయ్యేట్టు చేసిందని ఆరోపించారు.

వాల్మీకి కార్పొరేషన్ ఆర్థిక లావాదేవీల్లో మంత్రిగా తన సంతకం లేదని స్పష్టం చేశారు. బ్యాంకుల వ్యవహారాలకు సంబంధించిన లావాదేవీల్లో తనను ఎలా బాధ్యులు చేస్తారని, అలా బ్యాధుల్ని చేస్తే ముందుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజీనామా చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక బలమైన దళిత నేతగా తాను మనువాదులను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు.