ఒక్కసారి కలిసిపో!
31-08-2026 12:00 AM
మిన్నువిరిగి మీద పడ్డట్టు
అలా దాక్కుంటావేం?
బతుకుపై భయమెందుకు?
ఇవ్వాళుంటాం.. రేపు పోతాం !!
నీటి బుడగ జీవితానికి
ఇన్ని భేషజాలెందుకు?
బేఫికర్‌గా బతికే కొన్నిరోజులు చాలదా !
కొన్ని మాటల్ని ఇచ్చి పుచ్చుకోవాలి
ముఖాముఖిగా భావాల్ని పంచుకోవాలి
కొన్ని నవ్వుల్ని కళ్లారా చూసి
కొన్ని పువ్వుల్ని దాచుకు పోవాలి
కలవటం మరువకు
ఎక్కడో సుదూర తీరాల్లో ఉన్నట్టు
చరవాణిలో మాట్లాడకు
సాయంకాలం అలా సెంటర్‌కు రా !
ఛాయ్ తాగుతూ.. మాట్లాడుకుందాం..
సమస్యలన్నీ కట్టకట్టి ఇంట్లోపెట్టిరా..
ఓయ్.. నిన్నే ఒక్కసారి కలిసిపో !!
డా.రమేష్ కటుకోఝ్యల






