31 August, 2026 | 1:09 AM

వివక్ష రూపాలు వేరు

31-08-2026 12:00 AM

ఈ వివక్ష వుందే..

ఏదోఒక రూపంలో మనల్ని

వెంటాడుతూనే వుంటుంది..

చాలాసార్లు గుంటనక్కలానో

రాబందులానో, గద్దలానో

తోడేలులానో, శివంగిలానో

ఏదోఒక క్రూరమృగంలా మాత్రం

వెంటాడుతూనే వుంటుంది..

అయితే చాలాసార్లు

గోధుమ రంగు తాచుపాములా

వెంటాడుతూనే వుంటుంది..

ఎప్పుడు కాటేస్తుందో

ఏ రూపంలో

కాటేస్తుందో తెలియదు..

మన మనసు నురగలు కక్కుతూ

మృత్యుశయ్యపైకి చేరాక గానీ

అది వివక్ష చిమ్మిన విషమని

తెలియదు..

చాలామంది నాదస్వరం పట్టుకుని

పామును ప్రసన్నం చేసుకునే

పనిలో పడతారు..

నాలాంటి వాడు మాత్రం

కర్రపట్టుకుని పాము పడగ విరగ్గొట్టే

పనిలో అప్రమత్తంగా వుంటాడు..

తలొంచటం చేతగాని వాడిపైకే కదా!

పాములు విషం చిమ్మటానికి

పథక రచనలు చేస్తుంటాయి!

 చిత్తలూరి