మండలంలో దొంగల బీభత్సం
ఆలయంలో హుండీ ధ్వంసం, నగదు అపహరణ
గాంధారి, ఆగస్టు 30 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో దొంగలు భీభత్సం సృష్టించారు. మండలంలోని పోతంగల్ కలాన్ గ్రామ పంచాయతీ పరిధిలో గల బుగ్గ రామేశ్వర ఆలయంలోని రెండు హుండీలను ధ్వంసం చేసి నగదు దోచుకెళ్లారు. గ్రామస్థుల వివరాల ప్రకారం మండల లోని పోతంగల్ కలాన్ గ్రామ పంచాయతీ పరిధిలో అడవిలో గల బుగ్గరామేశ్వర ఆలయంలో శివుడు కొలువై ఉన్నాడు.
అయితే ఎంతో పురాతనమైన ఈ ఆలయాన్ని గ్రామస్థులు పలువురు దాతల సహకారంతో పునర్నిర్మాణం చేశారు, పాత ఆలయాన్ని అలాగే కొనసాగిస్తూ నూతనంగా ఆలయం నిర్మించారు. నూతన ఆలయంలో , పాత ఆలయంలో హుండీలను ఏర్పాటు చేశారు. గత ఏడాది శ్రావణ మాసం పూర్తయిన తరువాత హుండీ డబ్బులు లెక్కించి మళ్ళీ అందులోనే ఉంచి తాళం వేశారు.
అయితే శ్రావణ మాసంలో ప్రతి సంవత్సరం లాగే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం హుండీ ఆదాయం కూడా శ్రావణ మాసం పూర్తయ్యాక లెక్కించాలని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు.. కానీ ఇంతలో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు రాత్రికి రాత్రే ఆలయంలోని హుండీలను ధ్వంసం చేసి అందులో గల నగదు దాదాపు రూ.50వేల నగదు దోచుకెళ్లినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ చోరీ పై పోలీసులు విచారణ ప్రారంభించారు.






