6 June, 2026 | 1:38 AM

మధ్య తరగతి గుండెల్లో జూన్ దడ!

06-06-2026 12:00 AM
  1. ఓవైపు ఖరీఫ్.. మరోవైపు బడి
  2. వెంటాడుతున్న విత్తనాలు..ఫీజుల భయం
  3. ఇష్టారీతిగా ప్రైవేట్ ఫీజుల మోత
  4. అడ్డుకునేవారు లేక కుటుంబాలపై భారం

మునిపల్లి, జూన్ 5 : జూన్ వచ్చిందంటే తల్లిదండ్రులు, రైతుల్లో దడ మొదలవుతోంది. ఈనెలలోనే ఖరీఫ్ సీజన్ షురూ, విద్యాసంవత్సరం పునర్ ప్రారంభం ఉంటుంది. 12వ తేదీ నుంచి బడులు మొదలవుతుండగా ప్రైవేట్ పాఠశాలల్లో పిల్లలను చదివిస్తున్నతల్లిదండ్రుల్లో గుబులు మొదలైంది.

జిల్లాలో ప్రధాన ఉపాధి మార్గం వ్యవసాయమే. అయితే అతివృష్టి కారణంగా  పత్తి, సోయా పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రబీలో సాగు చేసిన పంట దిగుబడి డబ్బులు సైతం ఇంకా రైతుల చేతికందలేదు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. దుక్కులుదున్ని, విత్తనాలు విత్తుకునేందుకు రైతులు సన్నద్ధమయ్యారు. వరుణుడి కరుణ కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఇదే మాసంలో పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ఇటు పిల్లల చదువు, అటు సాగు భారం ఒకేసారి పడడంతో చేతిలో చిల్లిగవ్వ లేక రైతులు అవస్థలు పడుతున్నారు. 

పిల్లల భవిష్యత్తు కోసం...

తాము పడ్డ కష్టాలు తమ పిల్లలకు రావద్దని భావించి చాలా మంది తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో చేర్పిస్తున్నారు. సర్కారు బడుల్లో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు లేకపోవడం ఉపాధ్యాయుల కొరత కారణంగా మొగ్గుచూపడం లేదు. ఆర్థిక భారం అయినప్పటికీ కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదివిస్తున్నారు. ఓ వైపు పిల్లల చదువు, మరోవైపు సాగు పెట్టుబడి కారణంగా రైతులపై ఆర్థిక భారం పడుతుంది. ఎల్ కేజీ, యూకేజీలకే వేల రూపాయల్లో ఫీజులు కట్టాల్సిన పరిస్థితులున్నాయి. ఇంటర్, డిగ్రీ చదువులకు సైతం భారీగా వెచ్చించాల్సి వస్తోంది. మరోవైపు తల్లిదండ్రుల ఆశలను సొమ్ము చేసుకొని కొన్ని ప్రైవేట్ యాజమాన్యాలు అందినకాడికి దండుకుంటున్నాయి.

ధనార్జనే ధ్యేయంగా..

జిల్లాలో కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు ధనార్జనే ధ్యేయంగా పుట్టుకొస్తున్నాయి. ఆయా స్కూళ్లు, కాలేజీలను వ్యాపార సంస్థలుగా మార్చేస్తున్నారు. ఎల్కేజీ, యూకేజీ చదువులకు ఏడాదికి రూ.25వేల వరకు వసూలు చేస్తున్నారు. 1 నుంచి 5వ తరగతి వరకు రూ.40వేల వరకు, ఆపై తరగతులను బట్టి ఫీజులు పెంచుతూ పోతున్నారు. పదో తరగతికి రూ.70వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇరుకు గదులు, క్రీడా మైదానం లేకపోవడం, విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు, తాగునీరు, తదితర సౌకర్యాలు లేనప్పటికీ ఫీజుల వసూలులో మాత్రం వెనుకాడడం లేదనే విమర్శలున్నాయి. 

వేలల్లో ఫీజులు..

ఎల్ కేజీ నుంచి ఉన్నత చదువుల వరకు ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజులను భారీగా వసూలు చేస్తు న్నాయి. దీంతోపాటు పాఠశాలల్లోనే యూనిఫాం, పుస్తకాలు, నోట్ బుక్స్, టై, బెల్టు, షూ ఇలా అన్నీ విక్రయాలు జరు పుతున్నారు. బడి ప్రారంభం కాకముందే విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. మరికొన్ని పాఠశాలల యాజమాన్యాలు వారు సూచించిన బుక్ స్టాల్, బట్టల షాపుల్లోనే కొనుగోలు చేయాలని హుకుం జారీ చేస్తున్నారు. దీంతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడుతోంది.