ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలి
టేకులపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ
టేకులపల్లి, జూన్ 5 (విజయక్రాంతి): టేకులపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ అంకిత్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని వివిధ విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజలకు అందిస్తున్న సేవల నాణ్యత, దరఖాస్తుల పరిష్కార విధానం, కార్యాలయ నిర్వహణ తీరుపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వ సేవలు ప్రజలకు సకాలంలో పారదర్శకంగా అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అనంతరం ప్రజావాణి, భూభారతి, సాదా బైనామా, జనన-మరణ ధ్రువీకరణ పత్రాలు, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తదితర దరఖాస్తుల స్వీకరణ, పరిష్కార ప్రక్రియ, పెండింగ్ దరఖాస్తుల వివరాలను సమీక్షించారు. దరఖాస్తుల నమోదు, పరిష్కార స్థితికి సంబంధించిన రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించి, పెండింగ్లో ఉన్న దరఖాస్తులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని తాసిల్దార్ వీరభద్రంను ఆదేశించారు.
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రతి దరఖాస్తును ప్రాధాన్యతతో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలన్నారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయకపోవడాన్ని గమనించిన కలెక్టర్, వాటి నిర్వహణపై అధికారులను ప్రశ్నించారు. కార్యాలయానికి వచ్చే ప్రతి పౌరునితో మర్యాదపూర్వకంగా వ్యవహరించి వారి సమస్యలను సత్వరమే పరిష్కరించే దిశగా అధికారులు పనిచేయాలని సూచించారు. సంబంధిత రెవెన్యూ అధికారులు, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.






