14 May, 2026 | 11:08 AM

అవినీతిమ‌యంగా జిన్నారం రెవెన్యూ కార్యాల‌యం !

14-05-2026 09:34 AM
  1. నెల‌ల త‌ర‌బ‌డి బాధితుల ప‌డిగాపులు
  2. కాళ్ళు అరిగేలా తిరిగినా ప‌ట్టించుకోని అధికారులు
  3. ఆర్డీవోకు మొర‌పెట్టుకున్నా ఫ‌లితం శూన్యం
  4. నేరుగా క‌లెక్ట‌ర్‌కు మొర‌పెట్టుకున్న బాధితుడు

జిన్నారం(అమీన్‌పూర్‌): సంగారెడ్డి జిల్లా జిన్నారం రెవెన్యూ కార్యాల‌యంలో అవినీతి రాజ్య‌మేలుతోంది. బాధితులు కాళ్ళు అరిగేలా తిరుగుతున్నా అధికారులు క‌నిక‌రించ‌డం లేదు. చివ‌ర‌కు క‌లెక్టరేట్ మెట్లెక్కినా కూడా ఫైళ్ళు క‌ద‌ల‌డం లేదు. మామూళ్ళు ఇస్తేగానీ ప‌నిజ‌ర‌గ‌ని దుస్థితి నెల‌కొంది. రెవెన్యూ కార్యాల‌యంలో పూర్తిగా అవినీతి కార్యాల‌యంగా మారింద‌ని ప‌లువురు బాధితులు వాపోయారు. జిన్నారం మండలం మాదారం గ్రామానికి చెందిన కలివేముల వెంకటేష్ అనే రైతు తన భూమికి సంబంధించిన సర్వే నంబర్ 429 లో 2 ఎకరాల  భూమి ఉండగా, ఇందులోని 14 గంటల భూమి రికార్డుల్లో వేరొకరి పేరు నమోదయిందని బాధితుడు వెంకటేష్ తెలిపారు.

జిన్నారం ఎమ్మార్వో  దేవదాస్ కు రైతు లిఖిత‌పూర్వ‌కంగా ఫిర్యాదు ఇవ్వగా భూమిని సరి చేస్తానని తెలపడంతో రైతు వెళ్లిపోయాడు. ఇలా  ప్రతిరోజు జిన్నారం రెవెన్యూ కార్యాలయానికి వెళ్లి బాధిత రైతు మొర‌పెట్టుకున్నా రేపు, మాపు అంటూ కాల‌యాప‌న చేస్తున్నారు. నెలలు గడుస్తున్నా గాని ఫైళ్ళు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా త‌యారైంది. తహసిల్దారుని కలుస్తే జూనియర్ అసిస్టెంట్ ఉమామహేశ్వర్ ను క‌ల‌వాల‌ని చెప్పడంతో పలుమార్లు, కాళ్లు అరిగేలా తిరిగినా పట్టించుకోవ‌డం లేద‌ని బాధితుడు వెంక‌టేశ్ వాపోయాడు. ఇలావుండ‌గా జిన్నారం ఎమ్మార్వో గా ఉన్న దేవదాస్ భూభారతి కి సంబంధించిన ఫైళ్ళు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ బాధితులు ఆర్డిఓ ముందు మొరపెట్టుకున్నారు. త‌హ‌సీల్దార్‌, జూనియ‌ర్ అసిస్టెంట్‌పై ఫిర్యాదు చేశారు. 

ఏసీబీ అధికారుల నిఘా క‌రువు

జిన్నారం రెవెన్యూ కార్యాల‌యంలో అధికారులు, సిబ్బంది అవినీతి, అక్ర‌మాలు రోజురోజుకు పెరిగిపోతున్నా ఏసీబీ అధికారులు నిఘా పెట్ట‌డం లేద‌ని బాధితులు వాపోతున్నారు. ప్ర‌తి ప‌నికి మామూళ్ళు ఇవ్వ‌నిదే అధికారులు స్పందించ‌డం లేద‌ని ఆరోపించారు. నెల‌ల త‌ర‌బ‌డి బాధితులు కార్యాల‌యం చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నా ప‌ట్టించుకోకుండా తిప్పించుకుంటున్నార‌ని తెలిపారు. ఇప్ప‌టికైనా ఏసీబీ అధికారులు నిఘా పెట్టి అవినీతి అధికారుల భ‌ర‌తం పట్టాల‌ని కోరుతున్నారు. 

క‌లెక్ట‌ర్‌తో మొర‌పెట్టుకున్న బాధితుడు

జిన్నారం తహసిల్దార్ కార్యాలయంలో తమ భూమికి సంబంధించిన సర్వే నంబర్ లో ఉన్న త‌న భూమి మ‌రొక‌రి పేరుమీద రావ‌డంతో స‌రిచేయాల‌ని నెలలు తరబడి తిరిగినా స్థానిక‌ అధికారులు కనీసం పట్టించుకోక పోవ‌డంతో బుధ‌వారం క‌లెక్ట‌ర్ ప్ర‌తీక్ జైన్‌ను నేరుగా క‌లిశారు. దీంతో స్పందించిన క‌లెక్ట‌ర్ త‌క్ష‌ణ‌మే విచార‌ణ జ‌రిపి నివేదిక అందించాల‌ని జిన్నారం త‌హ‌సీల్దార్‌ను ఆదేశించారు.