జోగులాంబ గద్వాల జిల్లాలో మట్టి మాఫియా ఆగడాలు..
అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం.
గద్వాల టౌన్: జోగులాంబ గద్వాల జిల్లాలో మట్టి మాఫియా ఆగడాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గద్వాల మండల పరిధిలోని జమ్మిచేడు, ములకలపల్లి గ్రామ శివారుల్లో అక్రమ మట్టి, ఇసుక తవ్వకాలు బహిరంగంగానే కొనసాగుతున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని భారీ ఎత్తున నల్లమట్టి, ఇసుకను ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా తరలిస్తున్నప్పటికీ సంబంధిత శాఖల అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. పట్టపగలే యంత్రాలతో తవ్వకాలు జరుగుతున్నా మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖలు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక పలు అనుమానాలకు తావిస్తోందని ప్రజలు బహిరంగానే విమర్శిస్తున్నారు.
అక్రమ తవ్వకాల కారణంగా వ్యవసాయ భూములు దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట పొలాల వద్ద లోతైన గుంతలు ఏర్పడి భూములు సాగుకు అనుకూలంగా లేకుండా మారుతున్నాయని చెబుతున్నారు. మరోవైపు పర్యావరణ సమతుల్యతకు కూడా ముప్పు ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రింబవళ్లు ట్రాక్టర్లు, టిప్పర్లు గ్రామాల్లో తిరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధూళి, శబ్ద కాలుష్యంతో చిన్నపిల్లలు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారని స్థానికులు తెలిపారు. రోడ్లు దెబ్బతినడంతో ప్రయాణికులు కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు స్పందించి అక్రమ తవ్వకాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. మట్టి మాఫియాపై కఠిన చర్యలు తీసుకుని అక్రమ రవాణాను పూర్తిగా అడ్డుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.






