17 May, 2026 | 2:37 AM

నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్

17-05-2026 12:00 AM

తెలుగు రాష్ట్రాల నుంచి హాజరు కానున్న 45 వేల మంది

హైదరాబాద్, మే 16 (విజయక్రాంతి):దేశవ్యాప్తంగా ఆదివారం జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష జరగనుంది.  దేశంలోని 23 ఐఐటీల్లో బీటెక్ సీట్లను అడ్వాన్స్‌డ్‌లో వచ్చే ర్యాంకుల ఆధారంగా విద్యార్థులకు కేటాయిస్తారు. గత జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన 2,50,182 మంది విద్యార్థులు మాత్రమే ఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అర్హులుగా ఉంటారు. అయితే వీరిలో సుమారు 1.90 లక్షల మంది మాత్రమే అడ్వాన్స్‌డ్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.

తెలంగాణ, ఏపీ నుంచి సుమారు 45 వేల మంది పరీక్ష రాయనున్నట్లు తెలుస్తోంది. 2025 విద్యా సంవత్సరానికి 18,160 ఐఐటీ సీట్లతోపాటు మరో 300 సీట్లు అందుబాటులో ఉండే అవకాశముంది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు నిబంధనలను పాటించాలని అధికారులు సూచించారు.  ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్, సత్తుపల్లి, సిద్ధిపేట, సూర్యాపేట, వరంగల్‌లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మే 21న వెబ్‌సైట్‌లో అభ్యర్థుల ఓఎంఆర్ పత్రాలు, ప్రాథమిక కీ 25న, జూన్ 1న ఫలితాలు విడుదల చేసే అవకాశముంది. జోసా కౌన్సిలింగ్ జూన్ 2 నుంచి ఉంటుంది.