శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఏకాదశి లక్ష పుష్పార్చన
వైభవంగా నిత్య కళ్యాణం
యాదగిరిగుట్ట, ఆగస్టు 9(విజయక్రాంతి): శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో(Sri Lakshmi Narasimha Swamy Temple) ఆదివారం ఏకాదశి పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవ మూర్తులను వివిధ పట్టువస్త్రాలు, బంగారు, వజ్ర వైఢూర్యాలతో దివ్య మనోహరంగా అలంకరించిన అర్చకులు ప్రత్యేక వేదికపై అధిష్ఠింపజేశారు. సుగంధ పరిమళ పుష్పాలతో లక్ష పుష్పార్చన చేపట్టారు.
పాంచరాత్రాగమానుసారంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేదపండితులు, అధికారులు పాల్గొన్నారు. శని,ఆదివారం సెలవు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. యాదగిరిగుట్ట దేవస్థానంలో నిత్య కైంకార్యాలు సుప్రభాత సేవ, అభిషేకము, అర్చన,సుదర్శన నరసింహ హోమం,నిత్య కళ్యాణం, సాయంత్రం వెండి జోడు సేవలను భక్తులు పాల్గొన్నారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తమ మొక్కలను చెల్లించుకున్నారు. అనుబంధ ఆలయం అయిన శ్రీ రామలింగేశ్వరాలయంలో స్వయంభు స్పటిక లింగానికి అర్చకులు అభిషేకాలను నిర్వహించారు.






